Tim Walz : డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్

by Hajipasha |
Tim Walz : డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. డెమొక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతి వనిత, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఇప్పటికే జేడీ వాన్స్ పేరు ఖరారు కాగా, తాజాగా డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్ పేరును ప్రకటించారు. చికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ వేదికగా దీనిపై అధికారిక ప్రకటన వెలువరించారు. దీని గురించి వినగానే అక్కడే ఉన్న టిమ్ వాల్జ్ కుటుంబ సభ్యులంతా ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం టిమ్ వాల్జ్ ప్రసంగిస్తూ తనకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన డెమొక్రటిక్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.

60 ఏళ్ల వయసు కలిగిన టిమ్ వాల్జ్ ప్రస్తుతం మిన్నెసోటా రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. రెండు వారాల క్రితమే తొలిసారిగా ఆయనను కమలా హ్యారిస్ కలిశారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ పదవికి టిమ్ వాల్జ్ పేరును పరిశీలించమని డెమొక్రటిక్ పార్టీ ఎదుట కమలా హ్యారిస్ ప్రతిపాదన చేశారు. దానికి ఆమోదం కూడా లభించింది. టిమ్ వాల్జ్ నెబ్రస్కా రాష్ట్రంలోని ఓ చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. అమెరికన్ నేషనల్ గార్డ్‌లోనూ ఆయన సేవలు అందించారు. స్కూలులో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. చాలా ఏళ్లపాటు ఫుట్‌బాల్ కోచ్‌గా కూడా సేవలు అందించారు.అందుకే డెమొక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా టిమ్ వాల్జ్ పేరును ప్రతిపాదించగానే సభకు హాజరైన వారంతా ‘కోచ్ వాల్జ్’ అని రాసి ఉన్న ప్లకార్డులను పెద్దసంఖ్యలో చూపించారు.

Advertisement

Next Story

Most Viewed