రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల విధ్వంసం

by Y. Venkata Narasimha Reddy |
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల విధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యా క్షిపణులు, ఆయుధాల డిపోపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిపిన డ్రోన్‌ దాడులతో.. ఆయుధ డిపోను నేలమట్టం చేసి పెను విధ్వంసం సృష్టించింది. ఈ డిపోలో అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులు, స్వల్పశ్రేణి ఇస్కందర్‌ మిసైల్స్‌, టోచ్కా-యూ బాలిస్టిక్‌ క్షిపణులు, గైడెడ్‌ ఏరియల్‌ బాంబులు, ఆర్టిలరీ షెల్స్‌ ఉన్నట్లు ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ సరిహద్దులకు 470 కిలోమీటర్లు.. మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్వెర్‌ ప్రావిన్స్‌లోని టొరోపెట్స్ నగరంలో రష్యా భారీ ఆయుధ డిపో నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని రష్యా 2018లోనే ప్రకటించింది. కాగా టొరోపెట్స్ నగరంపై రాత్రిపూట డ్రోన్ల దాడి జరిగిందని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ నివేదించింది. సోషల్ మీడియాలో డిపో ఆవరణలో భారీ పేలుడు, అనేక భవనాలు మంటలను చూపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉక్రెయిన్‌ తన సరిహద్దుల్లోని ఐదు వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకుని, 52 గైడెడ్‌ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే.. ఏ తరహా డ్రోన్లను ప్రయోగించారనేదానిపై ఉక్రెయిన్‌ సైనికవర్గాలు వివరాలను వెల్లడించలేదు. రష్యాకూడా 46 క్షిపణులను గాల్లోనే పేల్చేసినట్లు ఆ దేశ అధికారిక వార్తాసంస్థ ఆర్‌ఐఏ పేర్కొంది. అయితే.. మూడు గైడెడ్‌ క్షిపణులు లక్ష్యాన్ని తాకినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఫలితంగా ఆయుధాగారం అగ్నికి ఆహుతైంది. సుమారు ఆరు కిలోమీటర్ల మేర భూకంపం వచ్చిందా? అన్నట్లుగా భూమి కంపించినట్లు రాయిటర్స్‌ పేర్కొంది.

ఈ ప్రావిన్స్‌లో 11 వేల జనాభా ఉంటుందని, అయితే.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. రష్యా నెటిజన్లు మాత్రం.. పేలుడు ధాటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లోని ఇళ్లు కూలిపోవడం.. పైకప్పులు ఎగిరిపోవడం వంటి వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆయుధ డిపోతోపాటు.. ఆర్టిలరీ సిబ్బంది క్వార్టర్స్‌ కూడా అగ్నికి ఆహుతైనట్లు ఉక్రెయిన్‌ సైనికవర్గాలు తెలిపాయి. ‘‘200 నుంచి 240 టన్నుల మేర శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయని భావిస్తున్నామని తెలిపారు. బుధవారం మధ్యాహ్నానికి కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయని వివరించాయి. రష్యా ఇటీవల ఉత్తరకొరియా నుంచి తెప్పించిన క్షిపణులను కూడా ఈ కేంద్రంలోనే నిల్వ చేసినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నాయి. నాసా వర్గాలు విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఉక్రెయిన్‌ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్‌ మీడియా వైనెట్‌ కూడా దీనిపై కథనాలను ప్రసారం చేసింది. ఉపగ్రహ చిత్రాల మేరకు పేలుడు జరిగిన ప్రాంతం చుట్టూ 14 చదరపు కిలోమీటర్ల మేర రేడియేషన్‌ను గుర్తించినట్లు పేర్కొంది. అయితే నాసా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఈ వివరాలు అందుబాటులో లేవని పలు వార్తాసంస్థలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed