చర్చి, పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి..ఎక్కడంటే?

by vinod kumar |
చర్చి, పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి..ఎక్కడంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ డాగేస్తాన్‌లో రెండు చర్చిలు, ఓ ప్రార్థనా మందిరం, ఒక పోలీసు పోస్ట్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పూజారి, 8 మంది పోలీసులు సహా మొత్తం 15 మంది మరణించారు. మరో 20 మందికి పైగా పౌరులు గాయపడ్డారు.ఈ విషయాన్ని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ సోమవారం తెల్లవారుజామున వెల్లడించారు. అయితే మృతుల సంఖ్యను అధికారులు ధ్రువీకరించలేదు. దాడికి గురైన యూదు దేవాలయం, చర్చి డాగేస్తాన్‌లోని డెర్బెంట్ నగరంలో ఉన్నాయి. ఇది ముస్లిం మెజారిటీ ఉత్తర కాకసస్‌లోని యూదు సమాజానికి బలమైన కోటగా ఉంది.

ఈ దాడులను రష్యా జాతీయ తీవ్రవాద వ్యతిరేక కమిటీ తీవ్రవాద చర్యలుగా అభివర్ణించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపింది. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని పౌరులకు సూచించింది. దాడిలో చర్చి, ప్రార్థనా మందిరం రెండూ పూర్తిగా కాలిపోయినట్టు సమాచారం. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. దాడి చేసినవారు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులని స్థానిక కథనాలు పేర్కొన్నాయి.దాడిలో పాల్గొన్న ఐదుగురు ముష్కరులను కూడా కాల్చి చంపినట్టు డాగేస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, తాజాగా జరిగిన ఉగ్రదాడి ఈ ఏడాది రష్యాలో జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రవాద దాడి కావడం గమనార్హం. అంతకుముందు మార్చిలో ఉగ్రవాద దాడి జరగగా..ఈ ఘటనలో 143 మంది మరణించారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐసీస్ కే ప్రకటించింది. అయితే ఇందులో ఉక్రెయిన్ ప్రమేయం ఉందని రష్యా ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed