ముగిసిన బతుకమ్మ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘లేజర్ లైట్ షో’

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-10 17:28:49.0  )
ముగిసిన బతుకమ్మ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘లేజర్ లైట్ షో’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంగిలి బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో శుక్రవారం ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో పలు చోట్ల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు టాంక్‌‌బండ్‌పై ఘనంగా జరిగాయి. మంత్రి సీతక్క, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి తదితరులతో పాటు సాంస్కృతిక కళాకారులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాణసంచాను పేల్చడంతో పాటు లేజర్ లైట్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి నుంచి వేలాది మంది మహిలలు బతుకమ్మలతో టాంక్‌బండ్ వేదిక వరకు ఊరేగింపుగా వెళ్ళారు. అనంతరం బతుకమ్మలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, బతుకునిచ్చే పండుగగా తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, ప్రకృతితో ముడిపడిన పండుగ అని అన్నారు.


ప్రతీ ఊరికి చెరువులతో అనుబంధం ఉంటుందని, బతుకమ్మల నిమజ్జనం ద్వారా చెరువులో నీరు శుద్ధి అవుతుందన్నారు. బతుకమ్మలో పేర్చే ప్రతీ పూవుకు జీవం ఉందన్నారు. అమ్మాయిలను బతకనీయండి... చదవనీయండి... గౌరవంగా ఎదగనీయండి.. అని పిలుపునిచ్చిన మంత్రి సీతక్క వారి ఎదుగుదలకు తెలంగాణ సమాజంలో అందరూ సహకరించాలని కోరారు. ఆడబిడ్డలను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని, ఆ లక్ష్యానికి ప్రతీ ఒక్కరూ తోడ్పడాలని కోరారు. మహిళలను రక్షించుకుందాం... మహిళలకు అండగా ఉందాం... అని ప్రతి ఇంటిలోని సోదరుడు ప్రతిన పూనాలని కోరారు. చిన్నతనం నుంచే పిల్లలకు ఆడిబిడ్డలను గౌరవించడాన్ని నేర్పించాలని, అది మన సంస్కృతిలో ఒక భాగంగా చూడాలన్నారు. చెరువులు, వాగులు, వంకలు, కుంటలు, రిజర్వాయర్లు నిండితేనే పంటలు పండుతాయని, వాటిని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నొక్కిచెప్పారు.

ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఉద్యమకారిని విమలక్క మాట్లాడుతూ, చెరువులను, కుంటలను కాపాడుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ పిలుపును ప్రతీ ఒక్కరూ స్వాగతించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రమైనా, హైదరాబాద్ నగరమైనా చెరువులు, కుంటలకు ప్రసిద్ధి అని, వీటిని పరిరక్షించడమంటే భవిష్యత్తు తరాలను కాపాడుకోవడమేనని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో చెరువులు, కుంటలకు మహర్దశ వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వీటిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని బతికిస్తుందన్నారు. బతుకమ్మకు కులంతో పాటు సామాజిక, ఆర్థిక అసమానతలు లేవని, వీటికి అతీతంగా మహిళలంతా సామూహికంగా జరుపుకునే పండుగ అని అన్నారు. జై బతుకమ్మ... జై జై బతుకమ్మ... అనే పాట పాడి ఈ వేడుకలను బహుజన బతుకమ్మగా అభివర్ణించారు.

Advertisement

Next Story

Most Viewed