మత్తు వదలరా!.. వారం వ్యవధిలోనే ఢిల్లీలో రూ. 7వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

by Mahesh Kanagandla |   ( Updated:2024-10-10 17:47:03.0  )
మత్తు వదలరా!.. వారం వ్యవధిలోనే ఢిల్లీలో రూ. 7వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
X

మత్తు వదలరాదిశ, నేషనల్ బ్యూరో: డ్రగ్స్ మహమ్మారి దేశాన్ని కమ్మేస్తున్నది. మాదకద్రవ్యాలు దొరకని రాష్ట్రాలు లేవు. ఏదో చోటా ఏదో ఒక రూపంలో డ్రగ్స్ క్రయవిక్రయాలు, సేవనం జరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ భూతం ఎక్కువ వేళ్లూనుకున్నది. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో వారం వ్యవధిలోనే రూ. 7 వేల కోట్లపైగా విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడటం.. డ్రగ్స్ నెట్‌వర్క్ ఏ స్థాయిలో పనిచేస్తున్నదో వెల్లడిస్తున్నది. అక్టోబర్ 2వ తేదీన రూ. 5,620 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. గురువారం (అక్టోబర్ 10) రూ. 2000 కోట్ల విలువైన మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు. డ్రగ్స్ ఎక్కువ సప్లై ఉన్న రాష్ట్రాల్లో అవి సులువుగా లభిస్తున్నాయి. కొంత గోప్యంగా కనిపిస్తున్నా.. డ్రగ్ పెడ్లర్లతో రెండు నిమిషాలు మాట్లాడి డబ్బులిస్తే చాలా మత్తు ప్యాకెట్లు చేతిలో పెట్టేస్తున్నారు.

ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్:

అక్టోబర్ 2వ తేదీన ఢిల్లీలో సుమారు 560 కిలోల కొకెయిన్, 40 కిలోల హైడ్రోపోనిక్ మరిజువానాలను పోలీసులు పట్టుకున్నారు. దక్షిణ ఢిల్లీలో మహిపాల్‌పూర్‌లోని ఓ గోదాంలో రూ. 5,620 కోట్ల విలువైన ఈ డ్రగ్స్‌ను తనిఖీల్లో సీజ్ చేశారు. ఈ స్థాయిలో ఢిల్లీలో డ్రగ్స్ దొరకడం ఇదే తొలిసారి. నలుగురు నిందితులను స్పాట్‌లోనే అరెస్టు చేశారు. ఆ తర్వాత అమృత్‌సర్‌, చెన్నైల నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర భారతంలో డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న యూపీకి చెందిన అఖ్లాక్‌ను కూడా పట్టుకున్నారు.

ఈ భారీ డ్రగ్ కన్‌జైన్‌మెంట్ వెనుక అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్‌కు సంబంధించి జితేంద్ర పాల్ సింగ్ అమృత్‌సర్ నుంచి యూకేకు పారిపోయే ప్రయత్నం చేశాడు. దుబాయ్‌ వ్యాపారవేత్త వీరేందర్ బసోయా కూడా ఈ డ్రగ్స్ రాకెట్‌లో ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈయన కోసం పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. యూకే నుంచి ఓ డ్రగ్స్ సిండికేట్.. మన దేశంలోని నెట్‌వర్క్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు.

లండన్‌కు పరార్

గురువారం కూడా ఢిల్లీలోని రమేష్ నగర్ ఏరియాలో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన (200 గ్రాముల) కొకెయిన్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సీజ్ చేశారు. ఈ కొకెయిన్‌ను రవాణా చేసే కారుకు జీపీఎస్ ఉండటంతో పోలీసులు దాన్ని క్రాక్ చేశారు. డ్రగ్స్ సీజ్ చేయగలిగారు.. కానీ, అప్పటికే నిందితులు పారిపోయారు. ఈ డ్రగ్స్‌ను నమ్కీన్ అనే ఓ స్నాక్స్ ప్యాకెట్‌లో ప్యాక్ చేశారు. ఢిల్లీకి కొకెయిన్ తెచ్చిన నిందితుడు లండన్‌కు పారిపోయినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

భోపాల్‌లో డ్రగ్స్ ఫ్యాక్టరీ

అక్టోబర్ 5వ తేదీన ఎన్సీబీ, గుజరాత్ ఏటీఎస్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బగ్రోడా అనే ఏరియాలో డ్రగ్స్ తయారు చేస్తున్న షాప్‌ను బట్టబయలు చేశారు. ఆ ఫ్యాక్టరీలో 907.09 కిలోల మెఫిడ్రోన్‌ను సీజ్ చేశారు. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 1814 కోట్లు పలుకుతుంది. ఇంకా డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడిసరుకులను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు అమిత్ చతుర్వేది, సన్యాల్ బానేలను అరెస్టు చేశారు. ఈ ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎలా తయారు చేస్తున్నారు? ఎవరి ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు? వంటి విషయాలపై దర్యాప్తు జరుగుతున్నది.

ఓపెన్ మార్కెట్

ఇదే మధ్యప్రదేశ్‌లో ఓ జాతీయ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ చాలా సింపుల్‌గా దొరుకుతున్నదని, ఎవరైనా సులువుగా తమకు అవసరమైనంత మేర డ్రగ్స్‌ను ఈజీగా కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయని తేలింది. ఓల్డ్ భోపాల్ పరిసరాల్లో స్టింగ్ ఆపరేషన్ చేపట్టగా ఓ ఫిష్ మార్కెట్ వెనుక భారీ మొత్తంలో డ్రగ్స్(బ్రౌన్ షుగర్, హాష్, మరిజువానా, ఎండీ, ఎండీఎంఏ అన్నీ) అమ్ముతున్నట్టు బయటపడింది. ఓ బహిరంగ ప్రదేశంలో అందరూ కూర్చుని ఉన్నారు. అక్కడ ఎవరిని అడిగినా డ్రగ్స్ ఇస్తున్నారు. మరో చోట దారికి పక్కనే కొందరు వ్యక్తులు బ్యాగులు పట్టుకుని పచార్లు చేస్తున్నారు. వారి వద్దకు వెళ్లి చరాస్ కావాలని అడగ్గా రూ. 300 తీసుకుని 30 గ్రాముల ప్యాకెట్ చేతిలో పెట్టాడు. మరో చోట ఓ మార్కెట్‌లో క్యాప్, గ్లాసెస్ పెట్టుకుని ముఖమంతా కర్చీఫ్‌తో చుట్టుకున్న ఓ వ్యక్తి రెండు నుంచి మూడు గ్రాముల ఎండీఎంఏ కోసం రూ. 20 వేలు అడిగాడు. ధనిక, పేద అనే తేడా లేకుండా ఎలాంటి చోటైనా ఇలా డ్రగ్స్ అమ్మకాలు ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా విక్రయాలు జరుగుతున్నట్టు ఆ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది.

Advertisement

Next Story

Most Viewed