టార్గెట్ రీచ్ అయ్యి తీరాలి.. మరోసారి నొక్కి చెప్పిన సీఎం రేవంత్

by Gantepaka Srikanth |
టార్గెట్ రీచ్ అయ్యి తీరాలి.. మరోసారి నొక్కి చెప్పిన సీఎం రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌లో పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడంపై వివిధ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు. లీకేజీలను అరికట్టి పన్ను వసూళ్ళను పెంచాలని నొక్కిచెప్పారు. ఆదాయాన్ని ఆర్జించే వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. టాక్స్ రెవెన్యూతో పాటు నాన్-టాక్స్ ఆదాయాన్ని కూడా పెంచడానికి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రణాళిక రూపొందించిందని గుర్తుచేసిన సీఎం రేవంత్... ఆ మేరకు టార్గెట్ రీచ్ కావాలని స్పష్టం చేశారు. వివిధ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే నిధుల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆర్థిక మంత్రిత్వవాఖ బాధ్యతలను కూడా చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయా విభాగాల అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

దీనికి కొనసాగింపుగా సీఎం రేవంత్ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాల్లో సాధించిన ప్రగతిని రివ్యూ చేసి రానున్న ఆరు నెలల్లో బడ్జెట్ అంచనాలు సాకారమయ్యేలా సూచనలు చేశారు. కమర్షియల్ టాక్స్, జీఎస్టీ, ఎక్సయిజ్, రవాణా, మైనింగ్, రెవెన్యూ (ల్యాండ్), హౌజింగ్ తదితర పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని పన్నుల వసూళ్ళపై సీఎంకు గణాంకాలతో సహా వివరించారు. లీకేజీలు లేకుండా అనుసరిస్తున్న విధానాలు, ఇందుకోసం ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను యాక్టివ్ చేయడం గురించీ వివరించారు. మద్యం దుకాణాల్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులను ప్రస్తావించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలని, ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూపై కోత పడకుండా, ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేయకుండా పటిష్ట నిఘా పెట్టాలని సూచించారు.

గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా వాటిని క్రమం తప్పకుండా చెల్లించడం, వాటి మీద వడ్డీలకు కూడా భారీ స్థాయిలో ఖజానా నుంచి వెచ్చించాల్సి వస్తున్నందున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది రాకుండా ఆర్థిక శాఖ మరింత యాక్టివ్ కావాల్సిన అవసరాన్ని సీఎం, డిప్యూటీ సీఎం నొక్కిచెప్పారు. రాజీవ్ స్వగృహ పరిధిలోని ఇండ్లకు సంబంధించిన పెండింగ్ వర్క్స్ ను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి వాటిని విక్రయించడంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. హౌజింగ్ బోర్డు పరిధిలో ఉన్న స్థలాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపైనా, రూపొందించాల్సిన విధివిధానాలపైనా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో వివిధ స్కీముల ద్వారా రావాల్సిన నిధులను రప్పించుకోవడంపైనా, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు సమర్పించడంపైనా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

డివొల్యూషన్ వాటాగా రూ. 3,745 కోట్లు :

కేంద్ర ప్రభుత్వం నుంచి డివొల్యూషన్ (కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా) రూపంలో తెలంగాణకు రావాల్సిన రూ. 3,745 కోట్లు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందులో ఆనవాయితీగా మూడవ త్రైమాసికం (అక్టోబరు నెలలో) ఇవ్వాల్సిన రూ. 1,872 కోట్లతో పాటు తదుపరి వాయిదాగా రావాల్సిన అంతే మొత్తాన్ని అడ్వాన్సుగా చెల్లించింది. ప్రతీ రాష్ట్రం వసూలు చేస్తున్న కేంద్ర పన్నుల్లో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ రూపొందించిన 42% కోటాలో తెలంగాణ వాటాగా 2.1% చొప్పున ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం నుంచి అక్టోబర్ నెలలో రూ. 89,086.50 కోట్లు రావాల్సి ఉన్నది. దీన్ని విడుదల చేయడంతో పాటు పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు తదుపరి ఇచ్చే వాయిదాను కూడా అడ్వాన్సుగానే ఇప్పుడు విడుదల చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1.78 లక్షల కోట్లను ఒకేసారి రిలీజ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed