- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైలెంట్ కిల్లర్ @ మొసాద్
- శత్రువులను వణికిస్తున్న ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్
- మూడో కంటికి తెలీకుండా టార్గెట్ ఫినిష్
- గూఢచర్యంలో అమెరికా సీఐఏతో పోటీ
- కొత్తగా పేజర్లు, వాకీటాకీల సీరియల్ బ్లాస్ట్స్
ఏ దేశానికైనా రక్షణ అంశాల్లో బలం సైన్యంలో ఉంటుంది. ఆ సైన్యానికి కూడా అవసరమైన సమాచారం ఇవ్వడంతోపాటు దిశానిర్దేశం చేసేదే నిఘా వ్యవస్థ. ఇతర దేశాలతో రాయబారం, వాణిజ్య ఒప్పందాలు సహా ప్రతి పనిలోనూ నిఘా వ్యవస్థ ఇచ్చే ఇన్ పుట్స్ దేశాధినేతలకు ఆధారం. అటువంటి నిఘా వ్యవస్థల్లో ప్రపంచంలోనే ది బెస్ట్ గా నిలిచింది మొసాద్. ఇజ్రాయెల్ పాలస్తీనా పోరులో ఎంతమంది బలి అవుతున్నా.. ఎన్ని దేశాలనుంచి హెచ్చరికలు వచ్చినా.. ఆ దేశానికి చెందిన నిఘా వ్యవస్థ మొసాద్ తన పనితాను చేసుకుంటూ వెళ్తున్నది. దేశ ప్రయోజనాలు మినహా మరేదీ ముఖ్యం కాదంటూ దూసుకువెళ్తున్నది. ఇటీవల లెబనాన్ దేశంలో ఒకేరోజు 3వేలకు పైగా పేజర్లు పేలాయి. ఈ ఘటనలో 12 మందికిపైగా చనిపోగా.. 2,800 తీవ్రంగా గాయపడ్డారు. ఆ మరునాడే వాకీటాకీలు పేలడంతో మరో 20మంది చనిపోయారు. 450మందికిపైగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలు హిజ్బుల్లా టెర్రరిస్ట్ గ్రూప్ లక్ష్యంగా మొసాద్ చేసిన దాడి. ఇజ్రాయెల్ ఈ విషయాన్ని అంగీకరించకపోయినా.. దాడికి ముందు ఆ దేశ బాంబర్లు అతి తక్కువ ఎత్తులో లెబనాన్ రాజధాని బీరుట్ మీదుగా వెళ్లడంతో భీకర గర్జనలకు జనం పరుగులు తీశారు. మొసాద్ దేశ రక్షణ పేరిట పాలస్తీనాలో నరమేథమే చేస్తున్నా.. అవలంబిస్తున్న ఆధునిక పోకడుల మాత్రం ఇతర దేశ నిఘా వ్యవస్థలకు మార్గదర్శకంగా నిలుస్తున్నది. తాజా లెబనాన్ దాడుల నేపథ్యంలో గతంలో ఆ సంస్థ చేసిన ఆపరేషన్లపై స్పెషల్ స్టోరీ.
-కట్ట సాయికుమార్
కరైన్ ఏ.. ఆపరేషన్ నోహ్ ఆర్క్..
మొసాద్ సాధించిన కీలక విజయాల్లో కరైన్ ఏ ఒకటి. యాసర్ అరాఫత్ హయాంలో పాలస్తీనా అథారిటీలోని కొందరు ఆయుధాలు సమకూర్చుకోవాలని భావించారు. అందుకు అనుగుణంగా 2000 సంవత్సరంలో అరాఫత్ మాజీ సహాయకుడు, వ్యాపారవేత్త ముఘ్‌రబీ ఇరాన్ నేతలతో సమావేశమయ్యాడు. గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీని దెబ్బకొట్టాలంటే బలమైన ఆయుధాలు కావాలని ప్రతిపాదన పెట్టాడు. ఇరాన్ సమ్మతించినా.. అక్కడినుంచి భారీ ఎత్తున ఆయుధాలు గాజాకు ఎలా తీసుకురావాలన్నదే వారికి సమస్యగా మారింది. ఈ విషయంలో లెబనాన్ హిజ్బుల్లా సహకరించేందుకు ముందుకు వచ్చింది. ముందుగా లెబనాన్ లో రిమ్ కే అనే ఓ భారీ నౌక 2001లో కొనుగోలు చేశారు. దాని పేరును కరైన్ ఏగా మార్చారు. ప్లాన్ లో భాగంగా ముందుగా ఆ నౌకను సూడాన్ తీసుకువెళ్లారు. అక్కడ సాధారణ సరుకులు తీసుకుని గాజాకు వెళ్తున్నట్లు పేపర్లు సిద్ధం చేసుకున్నారు. అక్కడినుంచి యెమెన్ లోని హొడీబాకు చేరుకుని అక్కడినుంచి ఇరాన్లోని కెష్మ్ దీవుల్లో ఆగింది. అయితే, పాలస్తానా అథారిటీతో సంబంధాలు తెంచుకుని సొంతంగా వ్యాపారం చేసుకుంటున్న ముఘ్‌రబీ తో పాలస్తీనా అథారిటీకి చెందిన ముఖ్యులు తరచూ సమావేశం కావడం.. ఆ వెంటనే అతడు ఇరాన్ పయనం కావడంతోనే మొసాద్ అలర్టయ్యింది. అతడి ప్రతి కదలికను కనిపెడుతూనే ఉన్నది. భారీ నౌక కొనుగోలు చేయడం మొదలు ప్రతి చర్యను మొసాద్ ఏజెంట్లు పరిశీలిస్తూనే ఉన్నారు. ఇరాన్ లో నౌక ఆగడం.. అందులోకి 83 భారీ కార్టన్లు ఆర్మీ వాహనాల్లో తరలిచడంతో అవి ఆయుధాలేనని మొసాద్ పసికట్టింది. ఆ నౌక ఇరాన్ ను వీడి ఎర్రసముద్రంలోకి అడుగు పెట్టగానే 2002 జనవరి 3 రాత్రి సమయంలో ఇజ్రాయెల్ నౌకాదళానికి చెందిన ఫిగెట్ దానిని అడ్డగించింది. కమెండోలు ఒక్క బుల్లెట్ వాడకుండానే కరైన్ నౌకను స్వాధీనం చేసుకున్నారు. దానిని టెల్ అవీవ్ కి తరలించి చూడగా.. 50 టన్నుల ఆయుధాలు లభ్యమయ్యాయి. అందులో వేల ఏకే 47 తుపాకులు, లక్షల సంఖ్యలో తూటాలు రెండున్నర టన్నుల భారీ పేలుడు పదార్థాలతోపాటు కత్యూష రాకెట్లు, మోర్టార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, ట్యాంక్ మైన్స్ స్వాధీనం చేసుకున్నారు. అలా పాలస్తీనాకు ఆయుధాలు అందకుండా చేసింది. పాలస్తీనా అథారిటీ నేతల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడమే కాకుండా వారు ఎవరితో కలుస్తున్నారనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతోనే మొసాద్ ఇంత పెద్ద ఆపరేషన్ విజయవంతం చేసింది.
ఆపరేషన్ ఫోర్ స్పెసీస్..
ఇదే తరహాలో 2009లో ఇరాన్ నుంచి సిరియాకు తరలుతున్న 320 టన్నుల ఆయుధాలను మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్ నేవీ సీజ్ చేసింది. దీనిని హిజ్బుల్లాకు చేరాల్సిన ఆయుధాలని.. ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లాలో కీలకమైన స్థానంలో ఉన్న మొసాద్ రహస్య గుఢాచారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇజ్రాయెల్ నేవీ ఈ ఆపరేషన్ సక్సెస్ చేసింది. ఇజ్రాయెల్ చరిత్రలో నాటినుంచి నేటి వరకు ఇంతభారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం అదే మొదటిసారి. ఈ తరహా భారీ ఆయుధ సరఫరాలను మొసాద్ అడ్డుకున్న ఘటనలు ఐదుకుపైనే ఉన్నాయి.
ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్‌పై అటాక్..
డాక్టర్ ఫక్రిజాదెహ్.. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సూత్రధారి. ఇరాన్‌లో అత్యంత భద్రత కలిగిన వ్యక్తుల్లో ఢాక్టర్ ఫక్రి ఒకరు. ఐదు వాహనాల కాన్వాయ్ లో ప్రయాణిస్తుంటారు. 2020లో ఆయన తన భార్యతో కలిసి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో నార్త్ టెహ్రాన్ వెళ్తున్నారు. ఒక చౌరస్తా రావడంతో ఆయన కాన్వాయ్ నెమ్మదించింది. కాస్త దూరంగా ఆగిన నిసాన్ పిక్అప్ వాహనం నుంచి వరుసగా 13 బుల్లెట్లు సరిగ్గా ఫక్రి కారుపైకి ఫైర్ అయ్యాయి. కారులోనే 25 సెంటీమీటర్ల దూరంలో కూర్చున్న ఆయన భార్యకు కూడా ఒక్క బుల్లెట్ తాకలేదు. ఆయన ముఖాన్ని టార్గెట్ చేసుకున్న తూటాలు బుల్లెట్ ప్రూఫ్ వాహనం పైకి ఒకేచోటు వరసగా కాల్చడంతో కారు అద్దం నుంచి బుల్లెట్ దూసుకువచ్చి ఫక్రిని హతమార్చాయి. ఇదంతా కొన్ని సెకండ్లలోనే జరిగిపోయింది. బాడీగార్డులు కాల్పులు జరిపిన వాహనం దిశగా వెళ్తుండగానే.. అధి భారీ విస్ఫోటనంతో పేలిపోయింది. తర్వాత, విచారణలో అది శాటిలైట్ ఆపరేషన్ తో తూటాలు పేల్చారని.. వాహనం కూడా రిమోట్ కంట్రోల్ తోనే పేల్చారని తేలింది. మొసాద్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చెప్పిన ఘటనల్లో ఇది కూడా ఒకటి. అయితే, ఈ దాడిని ఇజ్రాయెల్ ఇప్పటివరకు అంగీకరించకపోయినా ఇరాన్ సహా ప్రపంచం మొత్తం మొసాద్ పనేనని నమ్ముతున్నది.
పేజర్, వాకీటాకీ అటాక్స్ మూలం అప్పుడేనా?
1994 అక్టోబర్ 19న ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ తొలిసారి ఓ భారీ బాంబుదాడి చోటుచేసుకుంది. 20 కిలోల అత్యంత ప్రమాదకరమైన పేలుడుపదార్థం టీఎన్‌టీ బస్సులో పెట్టి పేల్చడంలో 21మంది చనిపోగా 50మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. మొసాద్ రంగంలోకి దిగి ఈ ఘటనకు సూత్రధారి ఎలక్ట్రికల్ ఇంజినీర్ యహ్యా అయ్యాష్ అని కనిపెట్టింది. అతడి గురించి వేట కొనసాగించగా.. 1996లో అతడి గురించిన సమాచారం వచ్చింది. అయ్యాష్ గాజాలోని రహస్య ప్రాంతాల్లో ఉంటూ ఫోన్ లో తండ్రి, కుటుంబంతో టచ్ లో ఉండేవాడు. ఈ క్రమంలో అతడి మిత్రుడి ద్వారా ఓ ఫోన్ ను మొసాద్ ఏజెంట్లు అయ్యాష్ కు చేర్చారు. అతడు తన తండ్రి నంబర్ కు డయల్ చేసి నాన్నా.. ఎలా ఉన్నారు? అని అనగానే రిమోట్ తో ఫోన్‌లో అమర్చిన బాంబు పేల్చారు. దీంతో అయ్యాష్ అక్కడికక్కడే చనిపోయాడు. అయ్యాష్ ఫోన్‌ను డయల్ చేసేముందు అతడిని నిర్ధారించుకోవడానికి మొసాద్ ఏజెంట్లు హెలికాప్టర్‌లో ఆ పరిసరాల్లోనే కాపు కాచి మరీ పని కానిచ్చేశారు. ఇప్పుడు హిజ్బుల్లా టార్గెట్ గా పేజర్లు, వాకీటాకీల్లో బాంబు అమర్చి పేల్చడానికి కూడా ఈ దాడే స్ఫూర్తి అని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎప్పుడు, ఎలా పుట్టిందంటే..
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్‌ను 13 డిసెంబర్ 1949లో అప్పటి ఇజ్రాయెల్ యూదు జాతీయ స్థాపకుడు, ప్రధాన మంత్రి డేవిడ్ బెన్ గురియన్ దీనిని ఏర్పాటు చేశాడు. ఇందులో 3 ప్రధాన విభాగాలున్నాయి. 1. అమన్ (మిలిటరీ ఇంటెలిజెన్స్), 2. షిన్ బెట్ (అంతర్గత భద్రత). 3.మొసాద్ (విదేశీ గూఢచార సేకరణ, గూఢచార విశ్లేషణ, రహస్య కార్యకలాపాలకు సంబంధించినది. మొసాద్ తొలి డైరెక్టర్‌గా రూవెన్ షిలోహ్ (1949-1953) పనిచేశారు. ఇంటెలిజెన్స్ సేకరణ , రహస్య కార్యకలాపాల నిర్వహణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మొసాద్ బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థ డైరెక్టర్ నేరుగా ప్రధానికి మాత్రమే జవాబుదారీగా ఉంటాడు. హెడ్ ఆఫీస్ టెల్ అవీవ్. ఇందులో 7వేల మంది పనిచేస్తుంటారని అంచనా. దీని వార్షిక్ బడ్జెట్ అంచనా 2.76 అమెరికన్ బిలియన్ డాలర్లు.
సూపర్ పవర్, అడ్వాన్డ్స్ ఇంటెలిజెన్స్..
ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యాక సరిహద్దు తగాదాలతో సిరియా, హమాస్ మిలిటెంట్స్ ఎప్పుడూ దాడులకు తెగబడుతూనే ఉండేవి. ఐడీఎఫ్ (IDF) దళాలు వాటిని ప్రతిఘటిస్తూనే ఉండేవి. ఇలా 1956లో సూయజ్ కెనాల్ సంక్షోభం,1973లో యోమ్ కిప్పూర్ యుద్ధం, 1982లో లెబనాన్ వార్, 2006లో రెండో లెబనాన్ వార్, ఇక 20వ శతాబ్దంలో 2008, 2012, 2014, 2021, 2023-24లోనూ ఇజ్రాయెల్-హమాస్ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ అన్ని యుద్ధాల్లో ఇజ్రాయెల్ విజయం వెనుక ‘మొసాద్’ హస్తముంది. ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలనే దానిపై మొసాద్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఐడీఎఫ్ దాడులు చేసేది. కాలక్రమేణా అత్యాధునిక టెక్నాలజీ, ఐరమ్ డోమ్స్, శత్రు దుర్భేధ్యమైన రాడార్ వ్యవస్థ, సైబర్ దాడుల్లోనూ ఇజ్రాయెల్ ఆరితేరింది.
పేజర్లు, వాకీటాకీల బ్లాస్ట్..
దక్షిణ లెబనాన్, బీరుట్ శివారు ప్రాంతాలు, తూర్పు బెకా లోయలో హిజ్బుల్లా మిలిటెంట్లకు చెందిన ‘పేజర్లు, వాకీటాకీ’లు పేలిన ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా 37 మంది మరణించిన విషయం తెలిసిందే. ‘ పేజర్లు, వాకీటాకీల్లో 3 గ్రాముల చొప్పున శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని అమర్చి, రిమోట్‌గా యాక్టివేట్ చేశారని’.. దీని వెనుక ‘మొసాద్’ హస్తముందని అని సీనియర్ లెబనీస్ భద్రతా అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. దీనిపై మొసాద్ మాత్రం స్పందించలేదు. తైవాన్‌కు చెందిన ‘గోల్డ్ అపోలో’ అనే కంపెనీ నుంచి 5 వేల పేజర్లను హిజ్బుల్లా నేతలు కొన్ని నెలల ముందే కొనుగోలు చేశారు. టెక్ కమ్యూనికేషన్, అధునాతన ట్రాకింగ్ సిస్టమ్‌లకు దొరకకుండా సురక్షితంగా మాట్లాడుకోవడానికి హిజ్బుల్లా నేతలు, సభ్యులు ఈ పేజర్‌లపై ఆధారపడుతున్నట్లు సమాచారం. హిజ్బుల్లా పేజర్ల ఆర్డర్ గురించి ముందే తెలుసుకున్న మొసాద్.. తైవాన్‌లో వాటి తయారీ సందర్భంగా లేదా రవాణా టైంలో అందులో రిమోట్ సెన్సింగ్ పేలుడు పదార్థాలు అమర్చి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యర్థిని కోలుకోకుండా దెబ్బతీసేందుకు ఈ పద్ధతిని ఇజ్రాయెల్ వాడి ఉంటుందని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి.
మొసాద్ సక్సెస్‌ఫుల్ సీక్రెట్ ఆపరేషన్స్..
మొసాద్ స్పై ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా 800లకు పైగా రహస్య ఆపరేషన్లు నిర్వహించి ఉంటుందని అంచనా. హమాస్ పౌర, సైనిక నేతలే లక్ష్యంగా టార్గెట్లను ఫినిష్ చేసింది. ఇటీవల హమాస్ అగ్రనేత హనియాను అంతమొందించి ప్రపంచం దృష్టిని మరోసారి తనవైపునకు తిప్పుకుంది. మొసాద్ నిర్వహించిన సక్సెస్ ఫుల్ ఆపరేషన్ల గురించి ఒకసారి పరిశీలిస్తే..
ఆపరేషన్ ఫినాలే 1960
1933 నుంచి 1945 మధ్య కాలంలో జర్మనీ నియంత హిట్లర్ ఆధ్వర్యంలో సాగిన మారణహోమంలో సుమారు 40 లక్షల మందికి పైగా యూదులు మరణించారని అంచనా. ఈ ఘటనలో జర్మనీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ అడాల్ఫ్ ఈచ్‌మెన్ కీలకంగా వ్యహరించారు. అతన్ని 1957లో అర్జంటీనాలో కిడ్నాప్ చేయించడమే కాకుండా ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చి మరణశిక్ష విధించడంలో మొసాద్‌ది కీ రోల్.
ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ 1972
జర్మనీలో మ్యూనిక్ ఒలింపిక్స్ జరుగుతున్న పాలస్తీనా బ్లాక్ సెప్టెంబర్ లిబరేషన్ ఆర్గజైనేషన్’కు చెందిన 8 మంది ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌కు చెందిన 11 మంది అథ్లెట్లను చంపేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఇజ్రాయెల్.. 9 ఏప్రిల్ 1973లో మొసాద్ ఏజెంట్లు, కమాండోలను పంపి 'బ్లాక్ సెప్టెంబర్ లిబరేషన్ ఆర్గనైజేషన్'ను హెడ్ ముహమ్మద్ యూసఫ్/ అబు యూసఫ్, అతడితోపాటు పీఎల్ఓ అధికార ప్రతినిధి కమల్ నజీర్‌లను అంతమొందించింది. మ్యూనిక్ అటాక్ లో భాగమైన ప్రతి ఒక్కరికి మొసాద్ వెంటాడి చంపడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆపరేషన్ సిరియా 1960..
ఈ టైంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినగా ఎలీ కోహెన్‌ను మొసాద్ ఏజెంట్‌గా నియమించుకుంది.1962లో సిరియాలో ప్రభుత్వం మారగా, కోహన్ ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలను పెంచుకున్నాడు. 1964లో సిరియా ఇజ్రాయెల్కు నీటి సరఫరా చేసే జోర్డాన్ నది దగ్గర పెద్దకాలువను నిర్మించాలని భావించగా.. కోహెన్ ఈవిషయాన్ని మొసాద్‌కు అందించగా, ఇజ్రాయెల్ అప్రమత్తం కావడంతో సిరియా ప్లాన్ బెడిసికొట్టింది.
మిషన్ ఇరాన్ - 2010
ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్ హత్యకు గురయ్యాడు. అతడి కార్ సమీపంలో పార్క్ చేసిన మోటర్ సైకిల్‌లో పేలుడు పదార్థం అమర్చడం వలన విస్ఫోటనం జరిగి మరణించడం వెనుక మొసాద్ హస్తముందని నిపుణులు పేర్కొన్నారు.కానీ, మొసాద్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆపరేషన్ థండర్‌బోల్ట్- 1976
ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడుతున్న సంస్థల్లో ‘పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా’ ఒకటి. 1976లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేసి లెబనాన్, ఉగాండాకు తరలించారు. మొసాద్ సాయంతో ఇజ్రాయెల్ కమెండోలు ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరుతో ఉగండా విమానాశ్రయానికి రాత్రిపూట ప్రత్యేక విమానాల్లో వెళ్లి అక్కడున్న ఉగాండా గార్డులతోపాటు హైజాకర్లను హతమార్చి బందీలను సురక్షితంగా ఇజ్రాయెల్ తీసుకువచ్చారు. శత్రుదేశానికి రహస్యంగా వెళ్లి.. కమెండో ఆపరేషన్ చేసి 100మందికిపైగా బందీలను సురక్షితంగా కాపాడిన ఘటనతో ఇజ్రాయెల్ ధైర్యసాహసాలకు మంచి పేరు వచ్చింది.
*హమాస్ ఆధ్యాత్మిక నేత అహ్మద్ యాసిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై 2004లో క్షిపణితో దాడిచేసి ఆయన్ను హతమార్చారు.
* కారుపై క్షిపణితో దాడిచేసి హమాస్ నేత అబ్దెల్ అజీజ్ అల్ రంటిస్సిని సైతం 2004లో మొసాద్ అంతమొందించింది.
* గాజా నగరంపై మాస్టర్ బాంబర్‌తో గగనతల దాడి జరిపి పాలస్తీనా అథారిటీలో నంబరు-2గా ఉన్న అద్నాన్ అల్ ఘౌల్‌ను ఏప్రిల్ 2004న చంపించింది.
* హమాస్ రాజకీయ నేతల్లో పేరొందిన మతపెద్ద నిజార్ రయ్యన్‌పై 2009లో జరిపిన దాడిలో ఆయనతో పాటు ఇద్దరు భార్యలు, ఏడుగురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
* 2018లో హమాస్ ఆయుధాల నిపుణుడు ఫదీ ముహమ్మద్ అల్ బాత్ష్ ఓ మసీదుకు వెళ్లేందుకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో ప్రయాణిస్తుండగా మోటారు సైక్లిస్టులుగా వచ్చి కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు.
* ఇజ్రాయెల్ పౌరులు, యూదులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారని 2024లో హదీ ముస్తఫా అనే వ్యక్తిని డ్రోన్‌తో దాడి చేసి హతమార్చారు.
* హమాస్ సీనియర్ కమాండర్ ఆమన్ షొవదేపై జూలై 2024లో గగనతలం నుంచి దాడి జరిపి ప్రాణాలు తీశారు.