రష్యా స్టేట్ కౌన్సిల్‌కు కార్యదర్శిగా మాజీ బాడీ గార్డును నియమించిన పుతిన్

by Harish |   ( Updated:2024-05-29 10:26:16.0  )
రష్యా స్టేట్ కౌన్సిల్‌కు కార్యదర్శిగా మాజీ బాడీ గార్డును నియమించిన పుతిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: అధ్యక్షుడు పుతిన్ తన మాజీ వ్యక్తిగత భద్రతా గార్డు అలెక్సీ డ్యూమిన్‌ను రష్యా స్టేట్ కౌన్సిల్‌కు కార్యదర్శిగా నియమించారు. రష్యా స్టేట్ కౌన్సిల్ అనేది ఉన్నత స్థాయి ఫెడరల్ అధికారులు, ప్రాంతీయ గవర్నర్‌లతో కూడిన రాజ్యాంగ సంస్థ, వారు జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై అధ్యక్షుడికి సలహాలు ఇస్తారు. బుధవారం ఉదయం ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అలెక్సీ డ్యూమిన్‌ను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ కార్యదర్శిగా నియమించినట్లు క్రెమ్లిన్ తన వెబ్‌సైట్‌‌లో ప్రకటించింది.

సలహాదారుగా పలు జాతీయ విషయాలపై డ్యూమిన్‌ పుతిన్‌కు సలహాలు ఇవ్వనున్నారు. సైనిక-పారిశ్రామిక సముదాయానికి సంబంధించిన సమస్యలు, రక్షణ మంత్రిత్వ శాఖ విషయాలపై పుతిన్‌తో సమన్వయం చేస్తుంటారు. రష్యాలోని తులా ప్రాంతానికి ప్రాంతీయ గవర్నర్‌గా పనిచేసిన తర్వాత 51 ఏళ్ల డ్యూమిన్‌ను ఈ నెల ప్రారంభంలో క్రెమ్లిన్‌లోకి తీసుకువచ్చారు. గతంలో పుతిన్‌కు వ్యక్తిగత భద్రతా గార్డుగా ఉన్నారు. మాజీ డిప్యూటీ డిఫెన్స్ మంత్రి, రష్యా GRU మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ హెడ్ అయిన డ్యూమిన్, మాజీ సలహాదారు సెర్గీ మార్కోవ్ స్థానంలో ఇప్పుడు పనిచేయనున్నారు. ఈయన నియామకం గురించి ఇంతకుముందే అక్కడి రాజకీయాల్లో ఊహాగానాలు వచ్చాయి.

Advertisement

Next Story