అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు: 21 యూనివర్సిటీల్లో ఆందోళన

by Dishanational2 |
అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు: 21 యూనివర్సిటీల్లో ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా చేపట్టిన నిరసనలు ఉధృతమయ్యాయి. కొలంబియా, లాస్ ఎంజిల్స్ సహా దేశ్యాప్తంగా 21 యూనివర్సిటీల్లో భారీగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన 34 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 100 మందికి పైగా విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. మొదటగా కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన నిరసనలు క్రమంగా ఇతర యూనివర్సిటీలకూ వ్యాపించాయి.

ఈ నిరసనలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెత్యన్యాహు స్పందించారు. ‘అమెరికా యూనివర్సిటీల్లో ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు జరగడం భయంకరమైంది. విశ్వవిద్యాలయాలను యాంటీ-సెమిట్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారు ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకుంటున్నారు. ఆందోళన కారులు యూదు విద్యార్థులు, ప్రొఫెసర్లను లక్ష్యంగా చేసుకున్నారు. దీనిని వెంటనే ఆపివేయాలి’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆందోళనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. మరోవైపు ఈ నిరసనల మధ్య యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా కొలంబియా విశ్వవిద్యాలయంలో పర్యటించి ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనాలకు మద్దతుగా అమెరికాలో ఏదో ఒక చోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గాజాలో పరిస్థితులు దుర్భరంగా మారడంతో విద్యార్థులు తమ ఆందోళనలను ఉధృతం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు యుద్ధం ఇప్పుడు ఈజిప్ట్ సరిహద్దు సమీపంలోని గాజాలోని రఫా నగరానికి చేరుకున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.



Next Story