Pakistan | భారత్‌తో దోస్తీ కోసం పాకిస్తాన్ అడుగులు.. 600 మంది భారత జాలర్ల విడుదలకు నిర్ణ‌యం

by S Gopi |   ( Updated:2023-05-07 02:31:27.0  )
Pakistan | భారత్‌తో దోస్తీ కోసం పాకిస్తాన్ అడుగులు.. 600 మంది భారత జాలర్ల విడుదలకు నిర్ణ‌యం
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా కాలంగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వైరం ఉండటంతో పాక్ ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీఓ) సమావేశంలో పాల్గొన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సహృద్భావ సూచకంగా 600 మంది భారతీయ జాలర్లను విడుదల చేయాలని పాకిస్తాన్ నిర్ణయించిందని తెలిపారు. రెండు దేశాలలో పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచ‌ల‌నంగా మారింది.

ఖైదీలుగా ఉన్న ఆ జాలర్లు రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను ఉల్లంఘించారనే ఆరోపణలపై పాక్ అదుపులో ఉన్నారు. ఈ 600 మంది ఖైదీలలో మొదటి విడత 200 మంది మత్స్యకారులను మే 12న, మిగిలిన 400 మందిని మే 14న విడుదల చేసే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా శత్రుత్వం, సరిహద్దు వివాదాల చరిత్ర ఉన్న దక్షిణాసియాలోని రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో ఈ చర్య సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.

నిజానికి ఇరు దేశాల‌కు చెందిన ఖైదీల విడుద‌ల విష‌యంలో స్ప‌ష్ట‌మైన‌, స‌మ‌గ్ర‌మైన విధానం లేదు. దీని వల్ల చాలా మంది ఖైదీలు శిక్షలను పూర్తి చేసిన తర్వాత కూడా అలాగే జైల్లళ్లలో మగ్గుతున్నారు. భారతదేశంలో కూడా 434 మంది పాకిస్థానీయులు ఖైదీలుగా ఉన్నారని.. వీరిలో 95 మంది మత్స్యకారులు ఉన్నట్లు స‌మాచారం.

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ రబియా జవేరి ఆఘా మే 1న జైళ్లలో ఉన్న మత్స్యకారుల విడుదల కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎన్ హెచ్చార్సీ తన ప్రచారంలో జాతీయ-అంతర్జాతీయ ఒప్పందాలను కూడా ప్రస్తావించింది. ఈ వలసదారుల విడుదల కోసం చర్చలకు రెండు దేశాలు ఒక షెడ్యూలు విధించాలని ఆమె డిమాండ్ చేసింది.

మత్స్యకారులకు 'నో అరెస్ట్' విధానాన్ని ప్రభుత్వాలు ప్రకటించాలని ఇరు దేశాల మానవ హక్కుల సంఘాలు పదేపదే డిమాండ్ చేస్తున్నాయి. ఈ మత్స్యకారుల విడుదలతో ఇరు దేశాల్లో ఇప్పటికే రద్దీగా ఉన్న జైళ్లపై భారం తగ్గడంతో పాటు ఖైదీల కుటుంబాలకు కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. విడుదల చేసే మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించనున్నారు. ఈదీ ఫౌండేషన్ విడుదల చేసిన 200 మంది జాలర్లను రోడ్డు మార్గం ద్వారా లాహోర్ కు తరలించబడతారు. సింధ్ ప్రభుత్వం ప్రతి భారతీయ మత్స్యకారుడికి 5,000 రూపాయలు, ఆహార పదార్థాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను అందిస్తుందని స‌మాచారం. ఈ చర్యను మానవహక్కుల సంస్థలు విస్తృతంగా ప్రశంసిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

Google | గూగుల్ ఆఫీస్‌పై నుంచి దూకిన యువ ఇంజనీర్.. ఏం జరిగిందంటే?

Advertisement

Next Story

Most Viewed