దక్షిణ కొరియా పాటలు విన్నాడని వ్యక్తిని ఉరితీసిన ఉత్తర కొరియా

by Harish |
దక్షిణ కొరియా పాటలు విన్నాడని వ్యక్తిని ఉరితీసిన ఉత్తర కొరియా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్ ఉన్ ప్రజల విషయంలో చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ఆ దేశంలో శత్రు దేశాల గురించి మంచిగా మాట్లాడటం కానీ, వారి సంస్కృతిని పాటించడం కానీ చేసినట్లయితే కఠినంగా శిక్షిస్తారు. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన పాటలు విన్నాడని, ఆ దేశ సినిమాలు చూశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని బహిరంగంగా ఉరి తీసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల దక్షిణ కొరియా ఒక నివేదికను విడుదల చేసింది. దీనిలో ఉత్తర కొరియా మానవ హక్కుల గురించి వెల్లడించింది. ఈ నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం, 2022లో దక్షిణ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌‌‌కు చెందిన 22 ఏళ్ల వ్యక్తి 70 దక్షిణ కొరియా పాటలు విన్నాడని, అలాగే, ఆ దేశానికి చెందిన 3 సినిమాలు చూశాడని, వాటిని ఇతరులకు షేర్ చేశాడని, అతన్ని బహిరంగంగా ఉత్తర కొరియా ఉరితీసింది. ఉత్తర కొరియా తన పౌరులు వినియోగించే సమాచారంపై ఎల్లప్పుడు నిఘా వేస్తూ, కఠినమైన నియంత్రణ కలిగి ఉంది.

శుత్రు దేశాలకు చెందిన సినిమాలు, పాటలు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్, పాశ్చాత్య సంస్కృతి వినియోగానికి సంబంధించి కఠినమైన నియమాలను అమలు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వాటిని ఉల్లంఘించినట్లయితే చాలా కఠినమైన శిక్షలు వేస్తారు.

మరోవైపు దక్షిణ కొరియా పేర్కొన్న మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. ఆ దేశం కావాలనే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని, మా నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే, ఉత్తర కొరియాలో పాశ్చాత్య సంస్కృతిపై నియంత్రణ అనేది మాజీ నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా, ఆ తర్వాత ఆయన కుమారుడు కిమ్ జోంగ్-ఉన్ ఆధ్వర్యంలో మరింత తీవ్రమైంది.

Advertisement

Next Story

Most Viewed