North Korea: దాడి చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం .. దక్షిణ కొరియాకు కిమ్ వార్నింగ్

by Shamantha N |
North Korea: దాడి చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం .. దక్షిణ కొరియాకు కిమ్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ సౌత్ కొరియాకు, అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. పాంగ్యాంగ్‌పై దక్షిణ కొరియా, దాని మిత్రపక్షమైన అమెరికా దాడి చేసేందుకు ప్రయత్నిస్తే.. అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థలు ప్రకటించాయి. ‘ఒక వేళ శత్రువులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించేలా సాయుధ బలగాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే వాటిపై అణ్వాయుధాలను పరీక్షిస్తాం’ అని కిమ్‌ పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. పాంగ్యాంగ్‌లోని సైనిక శిక్షణ స్థావరాన్ని కిమ్‌ సందర్శించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తర కొరియా ఒకవేళ తమపై అణ్వాయుధాలను ప్రయోగిస్తే అమెరికా కూటమితో కలిసి ఎదుర్కొంటాం. ఆ రోజుతో కిమ్ పాలన ముగిసిపోతుంది.’ అని ఇటీవలే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా కిమ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

చెత్త బెలూన్లు

ఇకపోతే, సౌత్, నార్త్ కొరియాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మే చివరి వారం నుంచి ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను దక్షిణ కొరియా భూభాగంలోకి వదులుతోంది. ఉత్తర కొరియాకు చెందిన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ వీడియోలను ఓ మీడియా సంస్థ విడుదల చేసింది. అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్స్ సంఖ్యను పెంచుకునేందుకు కిమ్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియాకు చెందిన 250 బాలిస్టిక్‌ క్షిపణి లాంచర్‌లను దక్షిణ సరిహద్దుల్లో మోహరించినట్లు ప్రకటించింది. మిత్రదేశాలైన రష్యా, చైనాల మద్దతుతో ఉత్తర కొరియా అనేకసార్లు ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘించింది.

Next Story

Most Viewed