నిర్మల్ ఆర్డీవో పై దాడిని తీవ్రంగా ఖండించిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం

by Mahesh |   ( Updated:2024-11-27 14:27:22.0  )
నిర్మల్ ఆర్డీవో పై దాడిని తీవ్రంగా ఖండించిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లా దిలావ‌ర్‌పూర్ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ల‌చ్చిరెడ్డి అన్నారు. నిర్మల్ ఆర్డీవో ర‌త్నక‌ల్యాణి ప‌ట్ల ఆందోళ‌న‌కారులు వ్యవ‌హ‌రించిన తీరు బాధాక‌రంగా ఉందన్నారు. ఆర్డీవో కారు పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తను అనారోగ్యంతో ఉందని కూడా చూడ‌కుండా కారులోనే నిర్బంధించ‌డం పట్ల మండిపడ్డారు. నిన్న ల‌గ‌చ‌ర్ల, నేడు దిలావ‌ర్‌పూర్ లో రెవెన్యూ అధికారుల ప‌ట్ల ఆందోళ‌నకారులు వ్యవ‌హ‌రించే తీరు స‌రైంది కాదన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ఉద్యోగులు పని చేసే వాతావరణం ఉండదన్నారు. పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకొని బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల కోసమే పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ఆందోళనకారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఏ సమస్య ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా, మౌఖికంగా చెప్పుకునే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులంతా జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందిస్తున్నారన్నారు. దాడులు చేస్తుంటే సక్రమంగా పని చేయలేరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు. ఈ మేరకు బుధవారం చీఫ్ సెక్రటరీ శాంతకుమారికి వినతిపత్రం సమర్పించారు. లగచర్లలోజరిగిన ఒక విషాద సంఘటన మరువకముందే మరోసారి మహిళా అధికారిణిలపై జరిగిన నిర్బంధకాండ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా మహిళా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతింటుందని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్, మహిళా అధ్యక్షురాలు రాధ, కోశాధికారి శ్రీనివాస్ శంకర్ లు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story