Mark Zuckerberg : జో బైడెన్ పై సంచలన ఆరోపణలు చేసిన మెటా చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌

by Maddikunta Saikiran |
Mark Zuckerberg : జో బైడెన్ పై సంచలన ఆరోపణలు చేసిన మెటా చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార డెమోక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్రంప్‌కు మద్దతు ప్రకటించగా.. తాజాగా మెటా చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా ట్రంప్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై జుకర్‌బర్గ్‌ సంచలన ఆరోపణలు చేశారు. జో బైడెన్ సారథ్యంలోని డెమోక్రటిక్ ప్రభుత్వం తనను చాలా ఇబ్బంది పెట్టిందని, పదేపదే ఒత్తిళ్లకు గురి చేసిందని ఆరోపించాడు. కోవిడ్‌కు సంబంధించిన పోస్ట్‌లను సెన్సార్‌ చేయాలంటూ ఫేస్‌బుక్‌పై బైడెన్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు US కాంగ్రెస్‌ హౌస్‌ జ్యుడిషియరీ కమిటీకి మార్క్‌ జుకర్‌బర్గ్‌ లేఖ రాశారు.

ఈ లేఖలో ఏముందంటే..?

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రాసిన ఈ లేఖను జ్యుడీషియరీ కమిటీ తన అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో పలు కీలక అంశాలను అతను ప్రస్తావించాడు. జో బైడెన్‌ ప్రభుత్వం అమెరికన్ల కోవిడ్‌ సమాచారాన్ని సెన్సార్‌ చేయమని ఫేస్‌బుక్‌పై ఒత్తిడి చేసిందని, బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ వివాదాస్పద ల్యాప్‌టాప్‌ కథనాలను కూడా పోస్ట్‌ కానివ్వకుండా బైడెన్ ప్రభుత్వం అడ్డుకుందని జూకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. కోవిడ్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌తో సహా ఎలాంటి కంటెంట్‌ అయినా సరే దాన్ని సెన్సార్‌ చేయమంటూ ఇబ్బంది పెట్టిందని స్పష్టం చేశారు. చివరకు వాటికి తలవంచాల్సి వచ్చిందని తెలిపారు. కంటెంట్‌ను సెన్సార్‌ చేయడానికే తుది నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్‌ వెల్లడించాడు.స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలియజేయాల్సిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఒత్తిడికి గురి చేయడం సరికాదని జూకర్‌బర్గ్‌ లేఖలో పేర్కొన్నారు. తనకు వైట్‌ హౌస్‌ అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురైనప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టనందుకు చింతిస్తున్నానని ఈ లేఖలో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed