హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు

by Sridhar Babu |
హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : వ్యక్తిని హత్య చేసిన కేసులో నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల ఇద్దరికి జీవిత ఖైదు విధించారు. శుక్రవారం ఈమేరకు తీర్పు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని నాగారం బ్రాహ్మణకాలనీకి చెందిన షేక్ మజీద్ ను ఎల్లమ్మ గుట్టకు చెందిన షేక్ జుబేర్, అతని చిన్నాన్న షేక్ అతీఖ్ సహకారంతో డిసెంబర్ 29, 2021లో హత్య చేశారని అభియోగం నమోదైంది. అనంతరం హత్యకు సంబంధించిన సాక్ష్యాలను లేకుండా చేశారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి షేక్ జుబేర్ తో పాటు హత్యకు సహకరించిన షేక్ అతీఖ్​కు జీవిత కారాగార శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే షేక్ మజీద్ ఎల్లమ్మ గుట్టకు చెందిన షేక్ జుబేర్ భార్యను లైగికంగా వేధించాడు.

దాంతో ఆయన తన చిన్నాన్న షేక్ అతీఖ్​​తో విషయాన్ని చెప్పాడు. ఇద్దరూ పథకం ప్రకారం డిసెంబర్ 29, 2021న మజీద్ వద్దకు వెళ్లి ఆయన్ని ఆటోలో ఎక్కించుకొని డిచ్ పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి వెళ్లారు. ముగ్గురూ కలిసి కల్లు తాగారు. అక్కడి నుంచి నిజామాబాద్ కు వస్తూ ముందుగా అనుకున్న ప్రకారం జుబేర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మజీద్ కడుపులో పొడిచాడు. ఈ క్రమంలో జుబేర్ చిన్నాన్న మృతుడిని గట్టిగా పట్టుకున్నాడు. మజీద్ చనిపోయాక ఆయన మృతదేహాన్ని డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామ శివారులోని కాలువలో పడేశారు. తరువాత పోలీసుల విచారణలో జుబేర్, అతీఖ్​​లు నిందితులని తేలడంతో వీరికి జీవిత ఖైదుతో పాటు రూ.రెండు వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు లేకుండా చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

Advertisement

Next Story