Army Officers Fiancee : ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసుల వేధింపులు.. నవీన్ పట్నాయక్ రియాక్షన్

by Hajipasha |
Army Officers Fiancee : ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసుల వేధింపులు.. నవీన్ పట్నాయక్ రియాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై భువనేశ్వర్ పోలీసులు ఆదివారం రాత్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిశాలో కలకలం రేపింది. బాధ్యులైన ఐదుగురు పోలీసులను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం రోజు ఒడిశా మాజీ సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ దారుణ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్)తో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన గురించి తెలిసి తాను చాలా షాక్‌కు గురైనట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు.

అలాంటి అకృత్యానికి యత్నించడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ ప్రభుత్వం పాలనా వైఫల్యాలకు ఇదొక నిదర్శనమన్నారు. తాము అధికారంలో ఉండగా పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వ సీనియర్ అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే వాళ్లమని ఆయన చెప్పారు. ఇక ఆర్మీ అధికారికి కాబోయే భార్యతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ పలు మహిళా సంఘాలు శుక్రవారం భువనేశ్వర్‌లోని పోలీస్ భవన్ వద్ద ధర్నా చేశాయి.

Advertisement

Next Story

Most Viewed