Lebanon: ఈసారి వాకీటాకీల వంతు.. లెబనాన్‌లో మరోసారి పేలుళ్లు !

by vinod kumar |
Lebanon: ఈసారి వాకీటాకీల వంతు.. లెబనాన్‌లో మరోసారి పేలుళ్లు !
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌లో దేశ వ్యాప్తంగా పేజర్లు పేలిన ఘటన నుంచి తేరుకోకముందే.. బుధవారం వాకీటాకీల్లో పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వాకీటాకీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోయాయి. ఈ ఘటనల్లో 9 మంది మరణించగా 300 మంది గాయపడ్డట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఎన్ని వాకీటాకీలు పేలాయనే విషయం వెల్లడించలేదు. తూర్పు లెబనాన్‌లోని వివిధ ప్రదేశాలలో ల్యాండ్‌లైన్ టెలిఫోన్లు కూడా పేలినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా సభ్యులు పేజర్ పేలుడులో మరణించిన చిన్నారి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా సమీపంలోనే అనేక వాకీటాకీలు పేలినట్టు సమాచారం.

ప్రతీకారం తీర్చుకుంటాం: హిజ్బొల్లా

ఈ పేలుళ్లను హిజ్బొల్లా సైతం ధ్రువీకరించింది. పేజర్ల మాదిరిగానే, అన్ని వాకీ-టాకీ పరికరాలు కూడా ఒకే సమయంలో పేలిపోయాయని తెలిపింది. ఇది ఇజ్రాయెల్ పనేనని ఈ దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. గాజాలో హమాస్‌కు మద్దతునిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. ప్రతిస్పందన కోసం ఇజ్రాయెల్ వేచి ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. అయితే మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఈ వాకీ-టాకీలను ఉపయోగించే వారని తెలుస్తోంది. వీటిని ఐదు నెలల క్రితమే హిజ్బొల్లా కొనుగోలు చేసినట్టు లెబనాన్ భద్రతా అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లెబనాన్‌లో ఇది రెండో అతిపెద్ద సాంకేతిక దాడి కావడం గమనార్హం. అంతకుముందు పేజర్లు పేలిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా..2800 మందికి పైగా గాయపడ్డారు. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది.

యుద్ధంలో కొత్తదశ ప్రారంభమైంది: ఇజ్రాయెల్

లెబనాన్‌లో పేలుళ్లకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బొల్లా ఆరోపిస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు. అయితే తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ తమ సైనికులతో మాట్లాడుతూ.. యుద్ధంలో కొత్త దశ ప్రారంభమైందని ప్రకటించారు. ఇజ్రాయెల్ భద్రతా సంస్థల పనిని ప్రశంసిస్తున్నట్టు తెలిపారు. ఫలితాలు ఎంతో ఆకట్టుకున్నాయని కొనియాడారు. యుద్ధంలో నూతన దశ ప్రారంభమైందని దీనికి మరింత ధైర్యం, సంకల్పం పట్టుదల అవసరమని చెప్పాడు. కానీ లెబనాన్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల పేలుళ్ల విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.

Advertisement

Next Story

Most Viewed