- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lebanon: లెబనాన్‌లో పేలిన పేజర్లు.. 9 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ లోని మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే లెబనాన్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. లెబనాన్‌లో దేశ వ్యాప్తంగా పేజర్లు (కమ్యునికేషన్ పరికరాలు) మంగళవారం ఒక్కసారిగా పేలిపోయాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 9 మంది మరణించగా.. 2800 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ ధ్రువీకరించారు. పేలుళ్లలో ఒక బాలికతో సహా తొమ్మిది మంది మరణించారని తెలిపారు. మృతుల్లో ఇద్దరు హిజ్బుల్లా సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో 200 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. గాయాలు ఎక్కువగా ముఖం, చేతులు, కడుపుపై అయ్యాయని తెలిపారు. పేజర్ పేలుడులో ఇరాన్ రాయబారి ముజ్తబా అమానీ కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. మరోవైపు సిరాయాలోనూ పేజర్లు పేలిపోగా 14 మంది గాయపడ్డారు.
హిజ్బొల్లా సభ్యులే లక్ష్యం!
పేజర్లను టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసి బ్లాస్ట్ చేశారని లెబనాన్ అధికారులు ఆరోపించారు. హిజ్బొల్లా సభ్యులే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడ్డారని, వారి చేతుల్లో ఉన్న పేజర్లే అధికంగా పేలిపోయాయని హిజ్బొల్లా తెలిపింది. అన్ని పేజర్లు దాదాపు ఒకే సమయంలో పేలాయని, ఈ హ్యాకింగ్ వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపించింది. దీనికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత వహించాలని తెలిపింది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. పేలుళ్లలో హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా కూడా గాయపడ్డారని పలు కథనాలు వెల్లడించగా.. హిజ్బొల్లా వాటిని ఖండించింది. ఈ పేలుళ్ల తర్వాత లెబనాన్ రాజధాని బీరుట్‌లోని దక్షిణ ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో గందరగోళ వాతావరణం కనిపించింది. ఆసుపత్రుల్లో వైద్యులంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. వైర్ లెస్ పరికరాలను వాడొద్దని పౌరులకు విజ్ఞప్తి చేసింది. పేలుళ్లకు గల కారణాలను తెలుసుకునేందుకు లెబనాన్‌లోని అధికారులకు దర్యాప్తు చేపట్టారు.
పేజర్ అంటే?
పేజర్ అనేది ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్స్ పరికరం. సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇది వైర్ లెస్ గా పని చేస్తుంది. చిన్న స్క్రీన్, పరిమిత కీప్యాడ్‌తో ఉంటుంది. దాని సహాయంతో, సందేశాలు లేదా హెచ్చరికలను త్వరగా స్వీకరించవచ్చు. దీనిని 1990, 2000 సంవత్సరాల మధ్య ఎక్కువగా వినియోగించారు. తాజాగా పేలిన పేజర్లు లేటెస్ట్ మోడల్ అని, అవి హిజ్బొల్లా యోధులకు ఇటీవలే అందించారని తెలుస్తోంది.