Knife Attack : జర్మనీలో దారుణం.. ఉన్మాది దాడిలో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-24 19:24:22.0  )
Knife Attack : జర్మనీలో దారుణం.. ఉన్మాది  దాడిలో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీలోని సోలింగెన్ (Solingen) నగరంలో శనివారం ఒక ఉత్సవంలో జరిగిన కత్తి దాడి కలకలం రేపింది. శనివారం సాయంత్రం సిటీ సెంటర్‌లో ఓ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఓ ఉన్మాది తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా అటాక్(Knife Attack) చేశాడు.అయితే ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాగా దాడికి పాల్పడిన ఉన్మాది ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు హెలికాప్టర్లతో పెద్ద ఎత్తున గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.అతని కోసం ప్రత్యేక బృందాలతో సోలింగెన్ సిటీ సెంటర్ చుట్టూ పెద్ద సంఖ్యలో బలగాలను సమీకరించామని,ఉన్మాదిని పట్టుకునేందుకు 40 వాహనాలను రంగంలోకి దింపామని స్థానిక పోలీసులు తెలిపారు

అయితే సోలింగెన్ నగరం యొక్క 650వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'ఫెస్టివల్ ఆఫ్ డైవర్సిటీ' పేరుతో సిటీలోని సెంట్రల్ వీధుల్లోని అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రజలపై నిందితుడు కావాలనే దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం ఒక్కడే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసు అధికారి అలెగ్జాండర్ క్రెస్టా తెలిపారు. కాగా సోలింగెన్‌లోని సిటీ ఫెస్టివల్‌లో జరిగిన క్రూరమైన దాడిపై జర్మన్ అంతర్గత మంత్రి నాన్సీ ఫేజర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేరస్థుడిని పట్టుకోవడానికి మా భద్రతా అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story