మరోసారి కిమ్ కవ్వింపు చర్యలు: జపాన్ సముద్రం మీదుగా 10 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం

by vinod kumar |
మరోసారి కిమ్ కవ్వింపు చర్యలు: జపాన్ సముద్రం మీదుగా 10 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జపాన్ సముద్రం మీదుగా ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను గురువారం ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ సైన్యాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అంతేగాక ఈ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఉత్తర కొరియా తన తూర్పు సముద్రం వైపు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.10 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను గుర్తించామని, వీటి పరిధి సుమారు 350కిలోమీటర్లు ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో పసిఫిక్ మహాసముద్రంలో నిఘాను మరింత పెంచినట్టు తెలిపారు. ఈ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవాలని జపాన్, అమెరికాలకు విజ్ఞప్తి చేశారు.

నార్త్ కొరియా కవ్వింపు చర్యల నేపథ్యంలో జపాన్ తీర రక్షక దళం ఓ సముద్ర భద్రత సలహాను జారీ చేసింది. నౌకలు ఏవైనా పడిపోయిన వస్తువులను కనుగొంటే జాగ్రత్త వహించాలని కోరింది. జపాన్ కు వచ్చే నౌకలను సోదాలు చేయనున్నట్టు తెలిపింది. జపాన్‌కు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపలి జలాల్లో ఈ క్షిపణులు పడిపోయాయని, భావిస్తున్నామని, నష్టానికి సంబంధించిన నివేదికలు ఏమీ లేవని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించేలా చేస్తున్న ప్రయోగాలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇటీవల ఉత్తర కొరియా చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే మరోసారి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం గమనార్హం. అంతకుముందు రోజు దక్షిణ కొరియా దృష్టిని మరల్చడానికి ఆ దేశ సరిహద్దుల్లో చెత్తతో నిండిన బెలూన్‌లను పంపించింది. దాదాపు 260 ఉత్తర కొరియా బెలూన్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పడిపోయినట్లు సౌత్ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా నుంచి ఎగురుతున్న వస్తువులను తాకొద్దని, వాటిని గుర్తించిన తర్వాత మిలిటరీకి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పౌరులకు సూచించింది.

Advertisement

Next Story

Most Viewed