canada: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్.. స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గింపు!

by vinod kumar |
canada: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్.. స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గింపు!
X

దిశ, నేషనల్ బ్యూరో: విదేశీ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను మరింత తగ్గించనున్నట్టు తెలిపింది. ఆదేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 35 శాతం తక్కువగా విదేశీ విద్యార్థులకు అనుమతి మంజూరు చేస్తున్నాం. ఇది వచ్చే ఏడాది నాటికి మరో 10 శాతం తగ్గుతుంది. విద్యార్థులు కెనడాలోకి రావడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమే అయినప్పటికీ కొందరు వ్యక్తులు ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. దానిని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు. కెనడాలో నెలకొన్న గృహ సంక్షోభం నేపథ్యంలో ట్రూడో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాక లిబరల్ ప్రభుత్వంపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి నేపథ్యంలోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

2025 నాటికి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చిన స్టడీ పర్మిట్‌ల సంఖ్యను 4,37,000కి తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2023లో మంజూరు చేసిన 5,09,390 అనుమతులతో పోలిస్తే ఇది భారీ తగ్గింపు కావడం గమనార్హం. 2024 మొదటి ఏడు నెలల్లో కేవలం కెనడా 1,75,920 స్టడీ పర్మిట్‌లను జారీ చేసినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. ఇక 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్‌ల సంఖ్య 2026లోనూ అలాగే ఉండనున్నట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు కూడా కెనడా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. 2026 నుంచి శాశ్వత నివాసితులకు ఇమ్మిగ్రేషన్‌ను పెంచడాన్ని ఆపివేస్తామని హామీ ఇచ్చింది. గ్రాడ్యుయేషన్ తర్వాత కొంతమంది విద్యార్థులకు వర్క్ పర్మిట్‌లను ఇవ్వడం ఆపివేస్తున్నట్లు తెలిపింది.

కాగా, కెనడా తాజా నిర్ణయంతో భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే కెనడాకు భారత్ నుంచే ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తుంటారు. 2022లో కెనడాలోని 5,50,000 మంది అంతర్జాతీయ విద్యార్థులలో 2,26,000 మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. అయితే, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా 2023లో ఈ సంఖ్య తగ్గింది. కెనడాలో ప్రస్తుతం 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్టు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed