Justin Trudeau: ట్రూడోపై అవిశ్వాస తీర్మానం.. త్వరలోనే ప్రవేశపెట్టే చాన్స్!

by vinod kumar |
Justin Trudeau: ట్రూడోపై అవిశ్వాస తీర్మానం.. త్వరలోనే ప్రవేశపెట్టే చాన్స్!
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని మాంట్రియల్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రధాని జస్టిన్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఫలితాల తర్వాత ట్రూడో ప్రభుత్వం ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. లిబరల్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ సీటులో ఓడిపోవడంతో ఆయనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. దీంతో ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే వారమే దీనిని తీసుకురావాలని భావిస్తున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. దీనికి గాను ఇప్పటికే ప్రతిపక్షాలు సిద్ధమైనట్టు తెలిపాయి. ఈ క్రమంలోనే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలీవ్రే ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ట్రూడో పన్నులు విపరీతంగా పెంచారు. ప్రజలకు ఖర్చులు భారం అవుతున్నాయి. ఇప్పటికే సమయం మించి పోయింది’ అని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలను కోరుకోవడంలో ఆశ్చర్యం లేదని తెలిపారు. దీంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం దాదాపు ఖాయమైందని పలువురు భావిస్తున్నారు.

కాగా, కేబినెట్ మంత్రి, లిబరల్ పార్టీ ఎంపీ డేవిడ్ లామిటీ రాజీనామా చేయడంతో మాంట్రియల్ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో బ్లాక్ క్యూబోకోయిస్ అభ్యర్థి లూయిస్ ఫిలిప్ విజయం సాధించారు. ఆయనకు 28శాతం ఓట్లు రాగా, లిబరల్ పార్టీ అభ్యర్థికి 27.2 శాతం ఓట్లు వచ్చాయి. అంతకుముందు జూన్ లో టొరంటో స్థానానికి జరిగిన ఉపఎన్నికలోనూ లిబరల్ పార్టీ ఓడిపోయింది. ఒకే ఏడాది రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో ట్రూడోకు సమస్యలు మరింత పెరిగాయి. ప్రస్తుతం కెనడా పార్లమెంటులో 336 మంది సభ్యులు ఉండగా.. లిబరల్ పార్టీకి 154 మంది మద్దతు ఉంది. తదుపరి ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. ఒకవేళ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాసం నెగ్గితే ముందస్తు ఎన్నికలు వచ్చే చాన్స్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed