ASEAN: లావోస్ ప్రధానితో భారత పౌరుల అక్రమ రవాణాపై జైశంకర్ చర్చలు

by Harish |
ASEAN: లావోస్ ప్రధానితో భారత పౌరుల అక్రమ రవాణాపై జైశంకర్ చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సమావేశాల్లో పాల్గొనేందుకు లావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా శనివారం ఆయన లావోస్ ప్రధాని సోనెక్సే సిఫాండోన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్కడి సైబర్ స్కామ్ కేంద్రాలు ద్వారా జరుగుతున్న భారతీయ పౌరుల అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రక్షణ, ఇంధనం, డిజిటల్ వంటి రంగాల్లో అభివృద్ధి భాగస్వామ్యం, పరస్పర సహకారంపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, సిఫాండోన్ మార్గదర్శకత్వాన్ని తాను విలువైనదిగా భావిస్తున్నానని జైశంకర్ అన్నారు.

లావోస్‌లోని కొన్ని సైబర్ స్కామింగ్ కేంద్రాలు భారత పౌరుల అక్రమ రవాణాను జరుపుతున్నాయి. ఈ విషయమై కంబోడియా, థాయ్‌లాండ్‌ విదేశాంగ మంత్రులతోనూ జైశంకర్ చర్చించారు. అక్కడి కొన్ని సైబర్ స్కామింగ్ కేంద్రాలు నకిలీ ఉద్యోగ ఆఫర్ల పేరిట భారతీయులను అక్కడి రప్పిస్తూ మోసం చేస్తున్నాయి. ఇలా ఆకర్షితులవుతున్న 13 మంది భారతీయులను రక్షించి స్వదేశానికి పంపినట్లు లావోస్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ఇప్పటివరకు ఎంబసీ 518 మంది భారతీయులను రక్షించింది. నకిలీ ఉద్యోగ ఆఫర్ల పట్ల భారతీయులు జాగ్రత్తగా ఉండాలని రాయబార కార్యాలయం హెచ్చరించింది. చర్చల సందర్భంగా జైశంకర్ ASEAN & తూర్పు ఆసియా శిఖరాగ్రానికి భారతదేశ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.

Advertisement

Next Story