రఫాపై మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..31 మంది మృతి

by samatah |
రఫాపై మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..31 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. తాజాగా సెంట్రల్ గాజాలో జరిపిన దాడిలో 31 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా పౌర రక్షణ విభాగం వెల్లడించింది. మరో 20 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. సెంట్రల్ నుసిరత్ శరణార్థి శిబిరంలోని ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేసినట్టు తెలిపింది. ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా శిథిలాల కింద ఇంకా మరిన్ని మృత దేహాలున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు శనివారం జబాలియా క్యాంపులో పాలస్తీనియన్లు నీటిని నింపుతున్న నీటి కంటైనర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు.

ఈ దాడుల నేపథ్యంలో యూఎస్ రాయబారి జేక్ సల్లివన్ ఇజ్రాయెల్‌లో పర్యటించి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ కౌంటర్ త్జాచి హనెగ్బితో సమావేశమయ్యారు. గాజా వివాదం, యుద్ధానంతర పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సాధారణీకరణ ఒప్పందంపై నెతన్యాహుకు వివరించినట్టు వైట్ హౌస్ తెలిపింది. పాలస్తీనా భవిష్యత్తు కోసం రాజకీయ వ్యూహంతో గాజాలో హమాస్‌పై సైనిక చర్యను ఆపాలని కూడా చెప్పినట్టు పేర్కొంది.

మరోవైపు యుద్ధం తర్వాత గాజా కోసం కొత్త ప్రణాళికను రూపొందించకుంటే తాను మంత్రివర్గానికి రాజీనామా చేస్తానని ఇజ్రాయెల్ కేబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నెతన్యాహు స్పందించారు. గాంట్జ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. గాంట్జ్ షరతులు ఇజ్రాయెల్ ఓటమికి దారి తీస్తాయని, అంతేగాక పాలస్తీనా రాజ్య స్థాపనకు తోడ్పడతాయని తెలిపారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed