భారత్-కెనడా దౌత్య వివాదం ఎఫెక్ట్: 15 శాతం తగ్గిన దరఖాస్తులు

by samatah |
భారత్-కెనడా దౌత్య వివాదం ఎఫెక్ట్: 15 శాతం తగ్గిన దరఖాస్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, కెనడాల మధ్య దౌత్య పరమైన వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెనడాకు వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం..కెనడా వెళ్లే భారతీయుల సంఖ్య 15శాతం తగ్గింది. ఇమ్మిగ్రేషన్, సిటిషన్ షిప్ కెనడా డేటా ప్రకారం..2022లో భారత్ నుంచి కెనడా వెళ్లేందుకు 3,63,484 దరఖాస్తులు రాగా.. 2023లో ఆ సంఖ్య 3,07,603కి పడిపోయింది. ముఖ్యంగా 2023 చివరి త్రైమాసికంలో దరఖాస్తులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం కెనడాలో సుమారు 3లక్షల మంది భారతీయ విద్యార్థులున్నట్టు భారత హైకమిషన్ అంచనా వేసింది. 2023 ద్వితీయార్థంలో దరఖాస్తులు తగ్గడం క్రమంగా ప్రారంభం కాగా..చివరి త్రైమాసికం వరకు భారీగా తగ్గడం గమనార్హం. కాగా, ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గతేడాది జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే దీని వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ట్రూడో వ్యాఖ్యలను భారత్ ఖండించినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారతీయుల సంఖ్య తగ్గడానికి ఈ వివాదమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేగాక కెనడాలో గృహ సంక్షోభం రోజు రోజుకూ ఎక్కువై పోతుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇది కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఒక కారణమై ఉండొచ్చు.

Advertisement

Next Story

Most Viewed