భారత్‌తో బంధంపై బంగ్లా పీఎం హసీనా ఆసక్తికర వ్యాఖ్యలు

by Hajipasha |
భారత్‌తో బంధంపై బంగ్లా పీఎం హసీనా ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్ర‌ధానమంత్రి షేక్ హ‌సీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. దేశంలోని మొత్తం 300 స్థానాలకుగానూ 266 చోట్ల పోటీ చేసిన అవామీ లీగ్ 200 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ గెలుపు నేపథ్యంలో షేక్ హ‌సీనా మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘‘బంగ్లాదేశ్‌కు భారత్ గొప్ప మిత్రదేశం. 1971,1975లలో కష్టకాలంలో భారత్ మాకు చేసిన సాయాన్ని మరువలేం. ఇండియానే నాకు, నా సోదరికి, నా కుటుంబ సభ్యులకు ఆశ్రయం ఇచ్చింది’’ అని ఆమె చెప్పారు.

ఆరేళ్ల పాటు ఇండియాలోనే గడిపాను..

‘‘బంగ్లాదేశ్‌లో మా కుటుంబ సభ్యుల హత్య జరిగిన తర్వాత నేను ఆరేళ్ల పాటు ఇండియాలోనే ప్రవాసంలో గడిపాను. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి’’ అని తెలిపారు. ‘‘భారత్ మాకు పొరుగిల్లు లాంటిది. మాకు, భారత్‌కు మధ్య చాలా సమస్యలు ఉండేవి. కానీ వాటిని ద్వైపాక్షికంగా పరిష్కరించుకున్నాం. అందుకే భార‌త్‌తో మాకు అద్భుతమైన సంబంధం ఉంది. నేను ఇండియాను అభినందిస్తున్నాను’’ అని ప్ర‌ధానమంత్రి షేక్ హ‌సీనా పేర్కొన్నారు. కాగా, 1975లో షేక్ హ‌సీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌తో పాటు ఆయ‌న భార్య‌, ముగ్గురు కుమారుల్ని మిలిట‌రీ అధికారులు చంపేశారు. ఆ టైంలో హ‌సీనా, రెహానాలు విదేశాల్లో ఉన్న కార‌ణంగా హ‌త్యాయ‌త్నం నుంచి త‌ప్పించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed