Morocco Earthquake: భారీ భూకంపం.. వెయ్యికిపైగా మృతులు.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

by Vinod kumar |
Morocco Earthquake: భారీ భూకంపం.. వెయ్యికిపైగా మృతులు.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
X

రబత్: మొరాకోను భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం రాత్రి 11:11 గంటల సమయంలో ప్రజలు గాఢనిద్రలో ఉండగా చోటు చేసుకున్న ఈ భూవిలయంలో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రముఖ పర్యాటక నగరం మరకేశ్‌‌కు 71 కి.మీ దూరంలో ఉన్న హై అట్లాస్ పర్వతాల్లో 18.5 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. ఈ భూకంప తీవ్రత ధాటికి 1037 మంది ప్రాణాలు కోల్పోగా, 1200 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు మొరాకో ప్రభుత్వం వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రతకు దేశంలోని మూడో వంతు ప్రాంతం ప్రభావితమైందని తెలిపింది.

దేశంలోని అల్ హఉజ్, మరకేశ్, ఉరాజాజాతె, అజీలాల్, చీచావువా, టారౌడంట్ మున్సిపాలటీలలో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయని మొరాకో హోం శాఖ చెప్పింది. మరకేశ్‌‌లోని మెదినాలో పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోయాయని పేర్కొంది. ప్రభావిత ప్రాంతాల్లోని శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండి పోతుండటంతో, రక్తదానం చేయాలని దేశ ప్రజలకు మొరాకో ప్రభుత్వం పిలుపునిచ్చింది. భూప్రకంపనలు స్పెయిన్, పోర్చుగల్ దేశాల వరకూ వ్యాపించాయి.

ప్రధాని మోడీ సంతాపం..

జీ20 సదస్సు ప్రారంభించడానికి ముందు.. మొరాకో భూకంపంలో చనిపోయిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. మొరాకో దేశానికి బాసటగా దేశాలన్నీ ఉన్నాయని అన్నారు. ఈ ప్రకృతి విపత్తులో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు అవసరమైన సాయమంతా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ప్రధానితోపాటు ప్రపంచ దేశాల అధినేతలు సైతం మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు.

Advertisement

Next Story