Hassan Nasrallah: హసన్ నస్రల్లా మృతి నిజమే..ధ్రువీకరించిన హిజ్బొల్లా

by vinod kumar |
Hassan Nasrallah: హసన్ నస్రల్లా మృతి నిజమే..ధ్రువీకరించిన హిజ్బొల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లోని హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం జరిపిన దాడుల్లో హసన్ మృతి చెందినట్టు ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేయలేరు’ అని పేర్కొంది. అలాగే నస్రల్లా కుమార్తె జైనబ్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. హసన్ మృతిని హిజ్బొల్లా సైతం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఆయన మరణించినట్టు పేర్కొంది. పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తామని, ఇజ్రాయెల్ పై తమ యుద్ధం కొనసాగిస్తామని ప్రకటించింది.

కాగా, బీరూట్‌లోని అనేక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం వైమానిక దాడులు చేసింది. హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా అటాక్ చేసింది. అయితే ఈ దాడుల అనంతరం ఐడీఎఫ్ ప్రతినిధి మాట్లాడుతూ.. దాడుల్లో భవనం పూర్తిగా ధ్వంసమైందని, ఇందులో నస్రల్లా సహా ఎవరూ బతికే అవకాశాలు లేవని తెలిపింది. ఈ ప్రకటన వెల్లడించిన కాసేపటికే ఆయన మరణించినట్టు ప్రకటించింది. శనివారం కూడా లెబనాన్‌లోని బెకా వ్యాలీలో ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుపడింది. నస్రల్లా మరణాన్ని ధృవీకరించిన తర్వాత, హిజ్బొల్లా 50 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడి చేసినట్టు పలు కథనాలు వెల్లడించాయి.

పోరాటం తీవ్రమవుతుంది: హమాస్

హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా మృతి పట్ల హమాస్ సంతాపం వ్యక్తం చేసింది. హసన్ మరణానంతరం ఇజ్రాయెల్‌పై పాలస్తీనా, లెబనాన్‌ల పోరాటం తీవ్రమవుతుందని హెచ్చరించింది. ప్రజలకు మద్దతుగా పోరాడుతూ నస్రల్లా ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. యుద్ధం మరింత ఉదృతం కానుందని స్పష్టం చేసింది. అలాగే హసన్ మృతి నేపథ్యంలో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్-సుడానీ దేశంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. నస్రల్లాను చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. సిరియా సైతం మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed