Ramgopal Varma: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా.. ఆర్జీవీ సంచలన వీడియో వైరల్

by Shiva |
Ramgopal Varma: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా.. ఆర్జీవీ సంచలన వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీ (YCP) నాయకులు, మద్దతుదారులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా (Social Media) వేదికగా టీడీపీ (TDP), జనసేన పార్టీ (Janasena Party) నాయకులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Varma)కు ప్రకాశం జిల్లా పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ‘వ్యూహం’ (Vyuham) సినిమా ప్రమోషన్ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma) ‘X’ (ట్విట్టర్) వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan)లను అవమానపరిచేలా, అసభ్యకంగా పోస్టులు పెట్టారు. సినిమాలో అనుచితంగా సీన్లు తీయడమే కాకుండా.. ప్రశ్నించిన వారిపై సెటైర్లు కూడా వేశారు. అప్పట్లో ఆర్జీవీ (RGV)పై టీడీపీ (TDP) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. తాజాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రకాశం జిల్లా నేతలు ఆర్జీవీ (RGV)పై పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కానీ, రెండు సార్లు నోటీసులు ఇచ్చినా.. ఇప్పటి వరకు రామ్‌గోపాల్ వర్మ విచారణకు హాజరుకాకుండా ఆజ్ఞాతంలోకి వెళ్లారు.

ఈ క్రమంలోనే ఆయన ఆచూకీ కోసం ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు (AP Police) ఆరు బృందాలుగా విడిపోయి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒక టీమ్ హైదరాబాద్‌ (Hyderabad)లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ (Shamshabad)లో గాలిస్తుండగా.. మరో టీమ్ తమిళనాడు (Tamilnadu)లోని కోయంబత్తూరు (Coimbatore)లో గాలిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆర్జీవీ సంచలన వీడియో విడుదల చేశారు. కేసులకు తానేమి భయపడటం లేదని అన్నారు. తాను పోస్టులు పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వాళ్ల మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని అన్నారు. తానే కాదు ప్రతి ఒక్కరూ పొద్దున లేస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. వాళ్ల మీద కూడా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఒకవేళ అలానే పెట్టాల్సి వస్తే.. దేశంలో 50 లక్షల మందిపై కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. పోలీసులకు మర్డర్లు, అత్యాచారాలు చేసిన నిందితులపై లేని శ్రద్ధ ఏడాది క్రితం పెట్టిన ఓ ట్వీట్‌పై ఎందుకు అని ప్రశ్నించారు. సోషల్ మీడియా (Social Media) ఉన్నదే ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోడానికని.. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఎంతమందిపై అని కేసులు పెడతారని ఆర్జీవీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed