భారత్, అమెరికా సంబంధాల్లో మరింత పురోగతి: యూఎస్ రక్షణ కార్యదర్శి ఆస్టిన్

by vinod kumar |
భారత్, అమెరికా సంబంధాల్లో మరింత పురోగతి: యూఎస్ రక్షణ కార్యదర్శి ఆస్టిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా-భారత్ మధ్య సంబంధాలు ఉమ్మడి దృక్పథం, ఉమ్మడి విలువలపై ఆధారపడి ఉన్నాయని, ఈ సంబంధాలు త్వరలోనే మరింత వేగం పుంజుకోనున్నాయని యూఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. సింగపూర్‌లో శనివారం నిర్వహించిన ‘షాంగ్రి లా డైలాగ్’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్-ఇండియా సంబంధాలపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. భారత్‌తో గతంలో కంటే ప్రస్తుతం మెరుగైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నామని చెప్పారు. భారత్‌తో కలిసి పకడ్బందీ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామని, ఈ ప్రాజెక్టులో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇండో-పసిఫిక్‌లో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ ప్రాంతంలోని తమ స్నేహితులతో కలిసి రక్షణ పరిశ్రమను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో చైనా సైనిక దృఢత్వం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా, భారత్, అనేక ఇతర ప్రపంచ శక్తులు స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, అభివృద్ధి చెందుతున్న ఇండో-పసిఫిక్‌ను నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆస్టిన్ నొక్కి చెప్పారు. యుఎస్ రక్షణ పరిశ్రమ జపాన్‌తో సహా ప్రాంతీయ దేశాలతో అనుసంధానించబడుతుందని తెలియజేశారు. ‘ఇండో-పసిఫిక్ సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తున్నాం. మిత్ర దేశాలతో కలిసి శాశ్వత భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే సామర్థ్యాల్లో పెట్టుబడి పెడుతున్నాం. ఈ ప్రాంతంలో యూఎస్ ఉనికిని కొనసాగిస్తుంది. దాని భాగస్వాములకు నిబద్ధతతో కూడిన పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుంది’ అని చెప్పారు.

‘షాంగ్రిలా డైలాగ్’ నేపథ్యం?

షాంగ్రి-లా డైలాగ్ అనేది ఆసియా అభివృద్ధి చెందుతున్న భద్రతా సవాళ్లపై ప్రభుత్వ మంత్రులు, సీనియర్ అధికారులతో పాటు వ్యాపార వేత్తలు, భద్రతా నిపుణుల మధ్య చర్చకు ఒక ప్రత్యేక వేదిక. ప్రతి ఏటా ఈ సదస్సును సింగపూర్‌లో నిర్వహిస్తారు. ఇది ఆసియాలో ప్రధానమైన రక్షణ సదస్సు. ఇందులో ప్రభుత్వ మంత్రుల నేతృత్వంలో ప్లీనరీ చర్చలు, అలాగే ప్రతినిధుల మధ్య ద్వైపాక్షిక చర్చలకు అవకాశం ఉంటుంది. 2002లో సింగపూర్‌లోని షాంగ్రి-లా హోటల్‌లో దాదాపు డజను మంది రక్షణ మంత్రులతో ఈ సంభాషణ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తారు.

Advertisement

Next Story

Most Viewed