Japan: కుంభకోణాలు, ద్రవ్యోల్బణంపై అసంతృప్తి.. జపాన్ పీఎం రాజీనామా

by Harish |   ( Updated:2024-08-14 11:16:52.0  )
Japan: కుంభకోణాలు, ద్రవ్యోల్బణంపై అసంతృప్తి.. జపాన్ పీఎం రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద సెప్టెంబర్‌లో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. టోక్యోలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విధమైన ప్రకటన చేశారు. ఇంకా ప్రధాని మాట్లాడుతూ లిబర్‌ డమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) లో కొత్త మార్పులు వస్తాయి. నాయకత్వాన్ని కొత్త వ్యక్తులకు అందివ్వాల్సిన సమయం వచ్చింది. వారి నాయకత్వానికి పూర్తిగా మద్దతిస్తాను. ఈ ఎన్నికల్లో, ఎల్‌డీపీ మారిందని, ఇప్పుడు అది సరికొత్త పార్టీ అని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. దీని కోసం, పారదర్శక, బహిరంగ ఎన్నికలు జరగాలి. ఎల్‌డీపీ మారుతుందని చూపించడానికి అత్యంత స్పష్టమైన మొదటి అడుగు నేను పక్కకు తప్పుకోవడమే, అందుకే నేను రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కిషిద చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇప్పుడు అధికారికంగా ఆయన నుంచి ప్రకటన వచ్చింది.

2021లో ఎల్‌డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన కిషిద 2025 వరకు పదవీ కాలం ఉన్నప్పటికి ముందస్తుగా రాజీనామా చేస్తున్నారు. కిషిదా పదవీకాలంలో జపాన్‌లో అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, పెరుగుతున్న ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో కిషిద ప్రజాదరణ క్షీణించింది, ఆయనకు మద్దతు 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. పార్టీలోని అవినీతి కుంభకోణాల కారణంగా పరిపాలన దెబ్బతింది, జీవన వ్యయం భారీగా పెరిగింది, ఇది ప్రజల విశ్వాసాన్ని గణనీయంగా దెబ్బతీసింది. దేశీయ, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో కూడా విఫలం అయ్యారు. దీంతో పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినకుండా ఉండటానికి కొత్త నాయకుడి కోసం కిషిద పదవి నుంచి తప్పుకుంటున్నారు.

కిషిదా రాజీనామా చేస్తారని ప్రకటించడంతో తదుపరి నాయకుడు ఎవరనే దానిపై ఊహగానాలు పెరిగిపోయాయి. పోటీదారులలో పార్టీ సెక్రటరీ జనరల్ తోషిమిట్సు మోటేగి, మంత్రి టారో కోనో, ఆర్థిక భద్రతా మంత్రి సనే తకైచి, విదేశాంగ మంత్రి యోకో కమికావా ఉన్నారు. పార్టీ నాయకుడిగా ఎన్నికైన వారిని తదుపరి పార్లమెంటరీ ఓటు ద్వారా కొత్త ప్రధానమంత్రిగా ఆమోదిస్తారు.

Advertisement

Next Story