చైనా మాజీ రక్షణమంత్రి అలా మిస్సయ్యాడు.. ఇలా దొరికాడు

by Hajipasha |
చైనా మాజీ రక్షణమంత్రి అలా మిస్సయ్యాడు.. ఇలా దొరికాడు
X

దిశ, నేషనల్ బ్యూరో : చైనాలో ఏకంగా విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులే మిస్సవుతుండటం యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఏదిఏమైనప్పటికీ గతేడాది అక్టోబరు నుంచి కనిపించకుండా పోయిన చైనా మాజీ రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే (70) ఎట్టకేలకు కనిపించారు. దీంతో ఆయన బతికే ఉన్నారని నిర్ధారణ అయింది. చైనా సీనియర్ శాసనసభ్యుడు ఓయున్‌ కెమాగ్ (81) ఇటీవల కన్నుమూయగా, నివాళులర్పించిన ప్రముఖుల్లో వీ ఫెంఘే కూడా ఉన్నారు. ఇదే కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కూడా పాల్గొన్నారు. దీన్నిబట్టి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంతో వీ ఫెంఘేకు సఖ్యత ఉందనే విషయం స్పష్టమైంది. వీ ఫెంఘే తర్వాత చైనా రక్షణ మంత్రి పదవిని చేపట్టిన జనరల్ లి షాంగ్ఫు కూడా తొలుత అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన్ను రక్షణ మంత్రి పదవి నుంచి తొలగించినట్లు తెలిసింది. గతేడాది చైనా విదేశాంగ మంత్రిగా ఉన్న టైంలో క్విన్ గ్యాంగ్‌ మిస్సయ్యారు. అనంతరం ఆయన్ను విదేశాంగ మంత్రి పదవి నుంచి తొలగించినట్లు ప్రకటన వెలువడింది. లి షాంగ్ఫు, క్విన్ గ్యాంగ్‌ నేటికీ పబ్లిక్‌గా కనిపించలేదు. వారు ఎక్కడున్నారు ? ఏమయ్యారు ? అనేది ఎవరికీ తెలియదు.

Advertisement

Next Story

Most Viewed