చబహార్ పోర్ట్ ఢీల్‌ను సంకుచిత భావంతో చూడొద్దు: అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

by samatah |
చబహార్ పోర్ట్ ఢీల్‌ను సంకుచిత భావంతో చూడొద్దు: అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లోని చబహార్ పోర్టు నిర్వహణకు భారత్-ఇరాన్‌ల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఇండియాకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అమెరికా వార్నింగ్ ఇవ్వడంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ అగ్రిమెంట్‌ను సంకుచిత దృక్పథంతో చూడొద్దని తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చుతుందని వెల్లడించారు. ప్రజల ప్రయోజనాలను ఉద్దేశించే ఈ ఢీల్ కుదుర్చుకున్నామని చెప్పారు. చబహార్ పోర్ట్ ప్రాముఖ్యతను గతంలో అమెరికా స్వయంగా ప్రశంసించిందని గుర్తు చేశారు. జైశంకర్ రాసిన ‘వై భారత్ మ్యాటర్స్’ పుస్తకం బంగ్లా ఎడిషన్‌ను బుధవారం ఆయన కోల్‌కతాలో ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఇంటరాక్షన్‌లో యూఎస్ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

‘యూఎస్ చేసిన కొన్ని వ్యాఖ్యలను నేను చూశాను. అయితే ఇది ప్రజలను కమ్యూనికేట్ చేయడం కోసం మాత్రమే జరిగిన ఒప్పందం అని నేను భావిస్తున్నా. ఈ ఢీల్ ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఉద్దేశించినది. దీనిని అర్థం చేసుకోవాలి’ అని తెలిపారు. చబహర్‌లోని ఓడరేవు ఎంతో ముఖ్యమైందని గతంలో అమెరికా ప్రశంసించిందన్నారు. అందుకే ఈ పోర్టును భారత్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశానికి సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. అయితే దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేయలేకపోయామని, ఇది ఎంతో ముఖ్యమైందని చెప్పారు. ఇరాన్ లోని కొన్ని సమస్యల వల్ల ధీర్ఘకాలిక అగ్రిమెంట్ పై సంతకం చేయలేకపోయామని వెల్లడించారు. కానీ పోర్ట్ ఆపరేషన్ విజయవంతం చేయడానికి ఇది అవసరమని తెలిపారు.

కాగా, చబహార్ పోర్ట్ అనేది భారతదేశం-ఇరాన్ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్, ఇది భూపరివేష్టిత దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యానికి ముఖ్యమైన రవాణా నౌకాశ్రయంగా పనిచేస్తుంది. పోర్ట్‌లోని ఒక విభాగంపై భారతదేశానికి నిర్వహణ నియంత్రణను అందించ డానికి గాను పదేళ్ల ఒప్పందంపై భారత్-ఇరాన్‌లు సోమవారం సంతకం చేశాయి. అనంతరం ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకునే ఏ దేశానికైనా ఆంక్షలు తప్పవని అమెరికా భారత్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే జైశంకర్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed