యువత చేతిలో దేశ భవిష్యత్తు : రాష్ట్ర గవర్నర్

by Kalyani |
యువత చేతిలో దేశ భవిష్యత్తు : రాష్ట్ర గవర్నర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యక్తి వికాసం కోసం కాకుండా జాతీయ వికాసం కోసం పని చేస్తుందని ఆయన తెలిపారు. ఏబీవీపీ నుంచి ఎంతోమంది గొప్ప నాయకులుగా ఎదిగారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల ఉద్ఘాటన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఏబీవీపీలో పనిచేసిన వారు ఎంత ఎత్తుకు ఎదిగిన జాతీయ భావాలను మాత్రమే కలిగి ఉంటారని తెలిపారు. దేశ పునర్నిర్మాణంలో విద్యార్థులు, యువత ముందు ఉండాలని సూచించారు. దేశ ప్రగతి కోసం విద్యార్థులు సరికొత్త ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి విద్యార్థి భారత మాత సేవలో తరించాలని.... దేశాన్ని విశ్వ గురువు చేయాలన్న వివేకానందుని లక్ష్యం వైపు పయనించాలన్నారు.

ప్రతి ఒక్కరిలో జాతీయ భావం ఉండాలన్నారు. కలలు కనడం తోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు అఖిల భారత సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఏబీవీపీ ప్రస్థానం అన్నింటి కన్నా భిన్నమైంది అన్నారు. ఏబీవీపీ సామాజిక సమస్యలపై కూడా పోరాటం చేస్తుందన్నారు. హిందీని జాతీయ భాషగా పరిగణలోకి తీసుకోవాలని మొదటగా సూచించింది ఏబీవీపీ అని గుర్తు చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నక్సలిజాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలదన్నారు. విద్యార్థులందరూ శారీరక దారుఢ్యం కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉందన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి మాట్లాడుతూ.... ఏబీవీపీ 75 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది అన్నారు.

55 లక్షల మంది అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు. రానున్న రోజుల్లో ఏబీవీపీ ని మరింత విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఏబీవీపీ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.... విద్యార్థులకు సమస్య ఉన్నచోట ఏబీవీపీ ఉంటుందన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తుందన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని మెడలు వంచి గద్దె దించిన ఘనత ఏబీవీపీకి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్ జి తోపాటు పలువురు ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story