బీభత్సం సృష్టించే తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారో తెలుసా?

by Anjali |   ( Updated:2023-12-05 11:28:42.0  )
బీభత్సం సృష్టించే తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ చెన్నైతో పాటు ఏపీ, తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుఫాన్ల కారణంగా ఒక్కోసారి ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవిస్తుంది. అయితే తుఫాన్‌ వచ్చినప్పుడల్లా వారి పేర్లను చూస్తే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కాగా ఈ తుఫాన్ల పలు రకాల పేర్లు విన్నప్పుడల్లా ఈ పేర్లు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఎలా పెడతారని చాలా మందిలో సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. అయితే తుఫాన్లకు పేర్లు పెట్టడం వెనుక పెద్ద కారణమే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుఫాన్ల హెచ్చరికలు, సూచనలు చేస్తుంటాయి. అలాగే వీటి నామకరణాలు కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి. తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ ప్రారంభించాయి. ఇక అప్పటి నుంచి తుఫాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భారత్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, ఒమన్‌, శ్రీలంక దేశాలు ఉన్నాయి. అయితే ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడుతుంటారు.

ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని తుఫాన్ల పేర్లను ముందుగానే నిర్ణయిస్తుందట. రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్యదేశాలు కోరుతుంది. ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతుంది. తుఫాన్లకు పేరు పెట్టే సంస్కృతికి అమెరికానే తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. మొత్తం 64 పేర్లను ఈ ఎనిమిది దేశాలు ఎంపిక చేయగా ఇప్పటికి 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేసేశారు. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా.. మలా అనే పేరును శ్రీలంక సూచించింది. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయగా, నీలోఫర్‌ పాకిస్తాన్ పెట్టింది.

Advertisement

Next Story