ఒక దేశం ఇంకొ దేశంపై ఆరోపణలు తప్ప చర్యలు శూన్యం: జైశంకర్

by Harish |
ఒక దేశం ఇంకొ దేశంపై ఆరోపణలు తప్ప చర్యలు శూన్యం:  జైశంకర్
X

న్యూఢిల్లీ: భారీగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్న అభివృద్ధి చెందిన దేశాలు వాటి నియత్రణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఆరోపించారు. కాలుష్య ఉద్గారాల నియంత్రణలో తమ వాటాను పంచుకోవడానికి బదులుగా ఇతర దేశాలపై ఆ భారాన్ని నెడుతూ ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు.

దుబాయ్‌లో నాలుగురోజులపాటు నిర్వహించనున్న ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో తొలిరోజు పర్యావరణ న్యాయం అనే అంశంపై చర్చలో భాగంగా మంత్రి సోమవారం ప్రసంగించారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) వంటి అంతర్జాతీయ పర్యావరణ వేదికల్లో ఇచ్చిన పలు హామీలను సంపన్న దేశాలు ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు.

కర్బన్ ఉద్గారాల మేటను భారీగా పోగుచేస్తున్న సంపన్న దేశాలు ఇతరులకు కూడా సహాయం చేస్తాయని చెబుతా వచ్చాయి కానీ నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఈ దేశాలు ప్రపంచానికి చేసిన సహాయం ఏదీ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి సీఓపీ భేటీకి ఈ దేశాలు కొత్త వాదనలు తీసుకొస్తున్నాయని ఆరోపించారు. ప్రపంచాన్ని మరింతగా గందరగోళంలో ముంచెత్తడానికే సంపన్న దేశాలు కాలుష్య ఉద్గారాల గురించి ఎప్పటికప్పుడు సరికొత్త వాదనలను తీసుకొస్తున్నాయని చెప్పారు.

ఫలాని దేశం ఎక్కువ ఉద్గారాలు వ్యాపింప జేస్తోందని, మరో దేశం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో పదింట ఒక శాతం ఉద్గారాలను కలిగి ఉంటోందని ఇవి ఆరోపణలు చేస్తున్నాయి తప్ప భూతాపానికి నిజంగా ఎవరు కారణమవుతున్నాయనే విషయాన్ని మాత్రం తెలివిగా పక్కదోవ పట్టిస్తూ, వాస్తవం చెప్పడం లేదని ఆరోపించారు. 2015లోనే పారిస్ ఒప్పందంపై భారత్ సంతకాలు చేసిందని మంత్రి గుర్తు చేశారు.

Advertisement

Next Story