Bomb Threats : అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం.. పోలింగ్ కేంద్రాలకు బాంబు బెదిరింపులు

by Hajipasha |   ( Updated:2024-11-06 06:48:24.0  )
Bomb Threats : అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం.. పోలింగ్ కేంద్రాలకు బాంబు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో ఓ వైపు అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు జార్జియా రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాలకు బాంబు బెదిరింపులు వచ్చాయనే వార్తలతో కలకలం రేగింది. దీనితో ముడిపడిన కీలక వివరాలను జార్జియా రాష్ట్ర సెక్రెటరీ ఆఫ్ స్టేట్ రాఫెన్ స్పెర్జర్ మీడియాకు వెల్లడించారు. జార్జియాలోని పలు కౌంటీల పరిధిలో ఉన్న దాదాపు 7 పోలింగ్ బ్లాక్‌‌లకు బాంబు బెదిరింపులు(Bomb Threats) వచ్చాయని ఆయన తెలిపారు. ఆ బెదిరింపు సందేశాలన్నీ రష్యా(Russia) నుంచి వచ్చాయని తేలిందని.. అయితే అవన్నీ ఫేక్ అని దర్యాప్తులో వెల్లడైందన్నారు.

అమెరికా ఎన్నికల వ్యవస్థకు అంతరాయం కలిగించి ఆనందపడాలనే సైకోయిజం ఈ ఆకతాయి వార్నింగ్‌లో స్పష్టంగా కనిపించిందని రాఫెన్ స్పెర్జర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో అధ్యక్ష ఎన్నికల(US Election) ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా, కచ్చితత్వంతో జరగాలని రష్యా కోరుకోవడం లేదు. అగ్రరాజ్యంలో ఈ టైంలో ఏదైనా అలజడి చెలరేగితే.. దాన్ని చూసి రష్యా ఆనందిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సీరియస్‌గా దర్యాప్తు చేస్తోందన్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న హైతీ దేశానికి చెందిన వలసదారుడు ఒకరు తాను ఒకటికి మించి ఓట్లు వేశానని చెబుతున్నట్లు ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తికి రష్యా నుంచి ముడుపులు అందాయని గుర్తించారు.

Read More..

Israel: డిఫెన్స్ మినిస్టర్‌ను తొలగించిన నెతన్యాహు

Advertisement

Next Story

Most Viewed