ఉక్రెయిన్‌‌కు సైనిక సాయంపై అమెరికా కీలక ప్రకటన..

by Vinod kumar |
ఉక్రెయిన్‌‌కు సైనిక సాయంపై అమెరికా కీలక ప్రకటన..
X

కీవ్ : రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌‌కు సైనిక సాయంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌కు డిప్లిటెడ్‌ యురేనియంతో చేసిన అణు తూటాలను అందిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్ కు తాము ప్రకటించిన రూ.8వేల కోట్ల సైనిక సాయంలో భాగంగానే వీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా ఆర్మీ భూతల దళాలను పారదోలడానికి అణు తూటాలను ఉక్రెయిన్ ఆర్మీ ఇకపై వినియోగిస్తుందని అమెరికా పేర్కొంది. 120 ఎంఎం యురేనియం ట్యాంక్‌ తూటాలు, ఎం1 అబ్రమ్‌ ట్యాంకులు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు, లాంగ్‌ రేంజ్‌ రాకెట్‌ లాంఛర్లు, శతఘ్ని గుండ్లు ఉక్రెయిన్‌కు అందిస్తామని చెప్పింది.

త్వరలోనే 31 ‘ఎం1 అబ్రమ్‌ ట్యాంకులు’ ఉక్రెయిన్‌కు అందుతాయని, వాటిలోనే అణు తూటాలను వినియోగిస్తారని అగ్రరాజ్యం తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రస్తుతం ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న తరుణంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. గతంలో ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ కూడా యురేనియం తూటాలను అందించింది. అమెరికా ఇవ్వటం మాత్రం ఇదే తొలిసారి. కాగా, డిప్లిటెడ్‌ యురేనియం అమర్చిన తూటా పేలుడు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది యుద్ధ ట్యాంకులకు అమర్చి ఉండే బలమైన లోహ కవచాలను కూడా చీల్చుకొని దూసుకెళ్లగలదు.

Advertisement

Next Story

Most Viewed