చైనాలో కరోనా బీభత్సం.. 35 రోజుల్లో ఎంత మంది మరణించారంటే..

by Harish |   ( Updated:2023-01-14 13:27:14.0  )
చైనాలో కరోనా బీభత్సం..  35 రోజుల్లో ఎంత మంది మరణించారంటే..
X

బీజింగ్: గత డిసెంబర్ లో కోవిడ్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా చైనా మృతుల సంఖ్యను వెల్లడించింది. నెల రోజుల సమయంలో 60 వేల మంది కొవిడ్ సంబంధిత రోగులు మృతి చెందారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. 2022 డిసెంబర్ 8 నుంచి ఈ ఏడాది జనవరి 12వ తేదీ మధ్యలో 59,938 మంది చనిపోయినట్టు జాతీయ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ జియావో యహుయ్ చెప్పారు. ఈ మృతుల సంఖ్య వైద్యం అందిన వారిది మాత్రమే. లెక్కలోకి రాని వారిని కలిపితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

మొత్తం మృతులలో 5,503 మంది శ్వాసకోశ సంబంధిత బాధతో చనిపోయారు. మిగిలిన 54,435 మంది కొవిడ్ సంబంధ వ్యాధులతో చనిపోయారని జియావో తెలిపారు. గత డిసెంబర్ నుంచి కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ఆ దేశంలో మృతుల సంఖ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల ఖచ్చితమైన సంఖ్యను బయటికి చెప్పడం అవసరం లేదని వైద్యాధికారులు బుధవారం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

కొవిడ్ మరణాలను లెక్కించేందుకు చైనా ఒక ప్రత్యేక పద్దతిని అనుసరించింది. వైరస్ వల్ల శ్వాస ఆడక చనిపోయిన వారిని మాత్రమే లెక్కిస్తామని వైద్యాధికారులు చెప్పారు. దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (హూ) తీవ్రంగా విమర్శించింది. ఇది సంకుచిత మనస్తత్వమని నిర్వచించింది. 'వైరస్ తో ఆస్పత్రులలో చేరిన వారి సంఖ్య, మృతుల సంఖ్యను నిజాయితీగా, క్రమం తప్పకుండా ఇవ్వాలని చైనాను మా సంస్థ నిరంతం కోరుతూనే ఉంది' అని హూ చైర్మన్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ చెప్పారు. అయితే సగటున 80.3 వయసున్న వారు చనిపోయారని శనివారం చైనా వైద్యాధికారులు చెప్పారు. 90 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారే అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed