Burkina Faso: బుర్కినాపాసోలో దారుణం.. గంటలోనే 600 మంది హత్య

by Shamantha N |   ( Updated:2024-10-05 06:25:01.0  )
Burkina Faso: బుర్కినాపాసోలో దారుణం.. గంటలోనే 600 మంది హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు సామాన్యులపై తెగబడ్డారు. గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని కాల్చి చంపారు. కాగా.. ఆగస్టులో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ సంస్థ జమాత్‌ నుస్రత్‌ అల్‌ ఇస్లామ్‌ వాల్‌ ముస్లిమిన్‌ (జేఎన్‌ఐఎం) మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

బుర్కినాఫాసోలో మిలిటెంట్లు తరచూ దాడులకు పాల్పడుతూ ఉంటారు. అయితే, ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోవాలని అక్కడి మిలిటరీ ఆదేశించింది. కాగా.. ఆగస్టు 24న బర్సాలోగోలో ప్రజలు తవ్వకాలు జరుపుతుండగా ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి దాడికి పాల్పడ్డారు. కాల్పులు జరుగుతుండగా.. ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెట్టారు. అయినప్పటికీ.. వెంటాడి మరి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కానీ, దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు మృతదేహాలు సేకరించేందుకు సమయం పట్టిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటన తర్వాత బుర్కినాపాసో వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కానీ, వారిని సైన్యం అణచివేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే, రెండుసార్లు సైన్యం తిరుగుబాటు చేసిన తర్వాత 2022లో పాలన మిలిటరీ జుంటా చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రెండు గ్రామాల్లోని దాదాపు 200 మందికి పైగా పౌరులను గతంలో సైన్యమే కాల్చి చంపింది.

Advertisement

Next Story

Most Viewed