BRICS: బ్రిక్స్‌లోకి 6 కొత్త దేశాలు..

by Vinod kumar |
BRICS: బ్రిక్స్‌లోకి 6 కొత్త దేశాలు..
X

జోహెన్నెస్‌బర్గ్‌ : ‘బ్రిక్స్’ కూటమిలోకి కొత్తగా 6 దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను బ్రిక్స్‌లోకి చేర్చుకుంటున్నట్లు ప్రస్తుతం బ్రిక్స్‌కు సారథ్యం వహిస్తున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటించారు. ఈ కొత్త దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా మారతాయని తెలిపారు. ఈమేరకు రూపొందించిన జోహెన్నెస్‌బర్గ్‌ డిక్లరేషన్ 2కు బ్రిక్స్ కూటమి ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. 2010 తర్వాత బ్రిక్స్ కూటమిని విస్తరించడం ఇదే తొలిసారి. ఈ కూటమిలో 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు ఉండేవి.

2010లో సౌతాఫ్రికా ఈ కూటమిలో భాగస్వామి అయింది. బ్రిక్స్ కూటమి ప్రపంచంలో 40 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచ జీడీపీలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ వాటాను ఈ కూటమిలోని దేశాలే అందిస్తాయి. బ్రిక్స్ కూటమిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను చేర్చుకోవడం పట్ల యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలు, ప్రజల శ్రేయస్సు, గౌరవం, ప్రయోజనాల కోసం సహకారం అందివ్వడానికి ఎదురుచూస్తున్నామని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

Next Story