మరోసారి తలపడనున్న బైడెన్, ట్రంప్: యూఎస్ అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నిక

by samatah |
మరోసారి తలపడనున్న బైడెన్, ట్రంప్: యూఎస్ అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపులు మరోసారి తలపడనున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున బైడెన్ అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నికయ్యారు. ఇద్దరికీ ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి కావాల్సిన ప్రతినిధుల మద్దతు లభించింది. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా మారేందుకు 1215 మంది ప్రతినిధుల మద్దతు అవసరం కాగా.. ట్రంపునకు 1228 మంది ప్రతినిధుల మద్దతు లభించినట్టు తెలుస్తోంది. అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి 1,969 మంది డెలిగేట్ల అవసరం కాగా బైడెన్‌కు 2,107 మంది అనుకూలంగా ఉన్నారు. మంగళవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో వీరిద్దరూ ఈ సంఖ్యను అధిగమించారు. దీంతో ట్రంప్, బైడెన్‌లు పోటీపడడం ఖాయమైంది.

అధ్యక్ష ఎన్నికలకు ముండు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్‌లు దూసుకెళ్లారు. మొదటి నుంచి దాదాపుగా అన్ని ప్రైమరీల్లో ఎక్కువ సంఖ్యలో ప్రతినిధులను కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ తమ పార్టీల నుంచి ఏ మాత్రం వ్యతిరేకతను ఎదుర్కోలేదు. దీంతో ఇంకా కొన్ని ప్రైమరీలు ఉండగానే అధ్యక్ష అభ్యర్థిత్వానికి కావాల్సిన మెజారిటీ సాధించారు. యూఎస్ అధ్యక్షులుగా పని చేసిన ఇద్దరు మరోసారి పోటీపడటం 1912 తర్వాత ఇదే తొలిసారి. బైడెన్ ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతుండగా.. ట్రంప్ నాలుగు క్రిమినల్ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో అమెరికన్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. 2021 ఎన్నికల్లో ట్రంపుపై బైడెన్ విజయం సాధించారు.

మద్దతు దారులందరినీ రిలీజ్ చేస్తా: ట్రంప్

తాను యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంటుపై దాడికి పాల్పడిన తన మద్దతుదారులందరినీ రిలీజ్ చేస్తానని చెప్పారు. ‘అమెరికన్లు దేశ భవిష్యత్ గురించి నిర్ణయించుకునే అవకాశం వచ్చింది. విజయం సాధిస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా. మన స్వేచ్ఛను రక్షించుకునే హక్కును పునరుద్దరిస్తా’ అని తెలిపారు. 2021లో బైడెన్ గెలిచాక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అనేక మంది ట్రంపు మద్దతుదారులు పార్లమెంటును ముట్టడించారు. ఈ కేసులో సుమారు 1300 మందికి పైగా అరెస్టు అయ్యారు. మరోవైపు ప్రైమరీలో విజయవంతం అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం, ప్రతీకారం వంటి వాటితో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇది అమెరికన్లకు వ్యతిరేకమని తెలిపారు.

Advertisement

Next Story