జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం..రెండు విద్యుత్ ప్లాంట్లకు స్వల్ప నష్టం

by vinod kumar |
జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం..రెండు విద్యుత్ ప్లాంట్లకు స్వల్ప నష్టం
X

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ జపాన్‌లో సోమవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 6:31 గంటలకు సంభవించిన ఈ భూపంక కేంద్రం నోటో ద్వీపకల్పంలో కేంద్రీకృతమై ఉన్నట్టు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. నోటో ద్వీపకల్పంలోని ఉత్తర కొనపై 5.9 తీవ్రతతో మొదటి ప్రకంపన, అనంతరం మరో పది నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్టు తెలిపింది. అయితే రెండు భూకంపాల వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదికలు ఏమీ లేవని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ప్రకంపనల అనంతరం సమీపంలోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లలో స్వల్ప నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. నోటో ద్వీపకల్పంలోని షికా ప్లాంట్‌, కాషివాజాకి-కరివా అణు కర్మాగారంలో తనిఖీ చేయడానికి కార్యకలాపాలు నిలిపివేసినట్టు వెల్లడించారు. అయితే జనవరి 1న ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 241 మంది మరణించారు. అనేక మంది నివాసితులు ప్రభావితమయ్యారు. జపాన్ సముద్ర తీర ప్రాంతంలోని అనేక భవనాలు గతంలో శక్తివంతమైన జనవరి భూకంపం, దాని అనంతర ప్రకంపనలలో దెబ్బతిన్నాయి. దాదాపు 125 మిలియన్ల ప్రజలు నివసించే ఈ ద్వీపసమూహం ప్రతి ఏటా అనేక భూకంపాలను ఎదుర్కొంటుంది. ఇది ప్రపంచంలోని భూకంపాలలో 18 శాతం వాటాను కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed