పాకిస్తాన్‌లో కోటి మంది పేదరికంలోకి జారిపోయే ప్రమాదం: ప్రపంచ బ్యాంకు

by Harish |
పాకిస్తాన్‌లో కోటి మంది పేదరికంలోకి జారిపోయే ప్రమాదం: ప్రపంచ బ్యాంకు
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో పరిస్థితి భయంకరంగా ఉందని ప్రపంచ బ్యాంక్ తన ద్వివార్షిక ఔట్‌లుక్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే చాలా మంది పేదరికంలోకి జారుకోగా, నగదు కొరత, ఉద్యోగ, ఆహార సంక్షోభం కారణంగా దాదాపు 1 కోటి మంది పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. పాకిస్తాన్ ప్రస్తుతం దాని అన్ని స్థూల ఆర్థిక లక్ష్యాలను కోల్పోతుంది. దేశం తన ప్రాథమిక బడ్జెట్ లక్ష్యం కంటే తక్కువగా పడిపోతుందని, అంతర్జాతీయ ద్రవ్య నిధి నిబంధనల ప్రకారం తన వద్ద ఉంచుకోవాల్సిన మిగులుకు వ్యతిరేకంగా వరుసగా మూడు సంవత్సరాలు లోటులో పాకిస్తాన్ ఉంటుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది.

పెరుగుతున్న జీవన వ్యయం, సంక్షోభం, రవాణా ఖర్చులు పెరగడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించడం తగ్గించారు. అనారోగ్య పరిస్థితుల్లో వైద్య చికిత్సలు కూడా భారంగా మారాయి, దీంతో కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందని నివేదిక తెలిపింది. దాదాపు 98 మిలియన్ల మంది పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికే పేదరికంతో సతమతమవుతున్నారు, పేదరికం రేటును 40 శాతంగా కొనసాగిస్తూనే ఆర్థిక వృద్ధి 1.8 శాతం వద్ద స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం 30 శాతానికి పైగా ఉన్నప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రోజువారీ కూలీల వేతనాలు నామమాత్రంగా కేవలం ఐదు శాతం మాత్రమే పెరిగాయని నివేదిక పేర్కొంది.

చాలా ప్రాంతాల్లో ఆహార భద్రత ఆందోళనకరంగానే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో తీవ్రమైన ఆహార భద్రత సంక్షోభం 29 శాతం నుండి 32 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. గతంతో పోలిస్తే ఆర్థికంగా కొంత కోలుకున్నప్పటికీ, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తక్కువ విదేశీ నిల్వలు, అధిక ద్రవ్యోల్బణంతో ఒత్తిడిలో ఉందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో 3.6 బిలియన్ డాలర్లుగా ఉన్న పాకిస్థాన్ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో 0.8 బిలియన్ డాలర్లకు తగ్గిందని, అలాగే ఇంధన ధరలు ఎక్కువగా ఉండటం వలన ద్రవ్యోల్బణం 26 శాతానికి పెరుగుతుందని నివేదిక తెలిపింది. ప్రపంచబ్యాంక్ జూన్ 2024తో ముగిసే త్రైమాసికం నాటికి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కేవలం 1.8 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 2.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed