నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు.. మహిళ పుస్తెలతాడు సేఫ్

by Sumithra |   ( Updated:2021-07-29 07:28:14.0  )
women-gold-safe
X

దిశ, చార్మినార్​ : భిక్షగాళ్ల మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో పోగొట్టుకున్న పుస్తెలతాడు తిరిగి ఆ మహిళ చెంతకు సురక్షితంగా చేరుకుంది. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉప్పుగూడ తానాజీ నగర్‌కు చెందిన ప్రయివేట్​ టీచర్​ స్వాతి జూలై 25వ తేదీన తన ఆక్టీవా వాహనంపై ఓల్డ్ సిటీలోని పలు అమ్మవారి ఆలయాలతో పాటు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించింది. తిరిగి ఇంటికి వస్తున్న తరుణంలో మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెల తాడు కనిపించలేదు. ఆందోళనకు గురైన స్వాతి వెంటనే ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసిన పోలీసులు స్థానికంగా ఉన్న ఆలయాల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ టైంలో చైన్​ ఆమె మెడలోనే ఉన్నట్లు గుర్తించారు.

చివరగా చార్మినార్ ​భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద మిస్ అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద భిక్షాటన చేస్తున్న వ్యక్తుల్లో ఒకరికి నాలుగు తులాల పుస్తెలతాడు దొరకడాన్ని మిగతా భిక్షగాళ్లు చూశారు. అయితే, ఏదైనా ఉంటే మనందరం కలిసి పంచుకుందామని భిక్షగాళ్ల మధ్య తొలుత ఒప్పందం కుదిరింది. పంపకాల సమయంలో భేదాభిప్రాయాలు రావడంతో చివరికి వాళ్ల మధ్య గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఓ భిక్షగాడు నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో చార్మినార్ ​పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే భిక్షగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి నాలుగు తులాల పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితురాలి అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed