ప్రభుత్వం పట్టాలిస్తే.. అధికారులు లాక్కుంటున్నారు.. మహిళా రైతుల ఆవేదన(వీడియో)

by Sridhar Babu |   ( Updated:2023-05-19 10:53:00.0  )
ప్రభుత్వం పట్టాలిస్తే.. అధికారులు లాక్కుంటున్నారు.. మహిళా రైతుల ఆవేదన(వీడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జగిత్యాల జిల్లా బుగ్గారంలో మహిళలు నిరసనకు దిగారు. నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణిలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో తాము సాగు చేసుకుంటున్నా బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తమకు పట్టా భూములను కేటాయించిందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు పథకం కూడా అమలవుతోందని వివరించారు. బుధవారం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యు అధికారులు అక్కడకు వెళ్లారు.

ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బుగ్గారం గ్రామ శివారులోని 516 సర్వే నంబర్‌లో 2 ఎకరాల చొప్పున అసైన్డ్ భూమి తమకు కేటాయించారని మహిళా రైతులు వివరించారు. తమకు కేటాయించిన భూములు లాక్కుంటే చావే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పార్కు నిర్మాణం కోసం ఈ భూమిని అలాట్ చేసేందుకు తహసీల్దార్.. గత కొన్ని రోజులుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం 516 సర్వే నంబర్ భూమి కేటాయింపు కోసం క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సాగు చేస్తున్న భూమి తమదని, ఇందులో పార్క్ నిర్మించవద్దని మహిళా రైతులు నిరసనకు దిగారు.

కమిటీ అప్రూవల్ లేదు.. తహసీల్దార్ ఫారుక్

బుగ్గారం గ్రామంలోని 516 సర్వే నంబర్ భూ వివాదంపై స్థానిక తహసీల్దార్ ఫారుఖ్‌ను వివరణ కోరగా.. నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణిలు భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు ఉన్నమాట నిజమే కానీ, వారికి భూమి కేటాయించినట్లు అసైన్‌మెంట్ కమిటీ అప్రూవల్ లేదన్నారు. ఈ ముగ్గురు మహిళా రైతులు కాస్తులో కూడా లేరని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం కొరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed