జమ్మికుంటలో దారుణం.. కరోనా వచ్చిందని మహిళను..

by Sridhar Babu |   ( Updated:2021-04-14 00:00:47.0  )
జమ్మికుంటలో దారుణం.. కరోనా వచ్చిందని మహిళను..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పేగు తెంచుకున్న కొడుకులు దరికి రానివ్వలేదు. ఇంటి యజమాని వెల్లగొట్టాడు. అనారోగ్యానికి గురైన ఆ మహిళకు ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న తోపుడు బండే దిక్కయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృత్యువు కబలించింది. వివరాల ప్రకారం … కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్థానిక అంబేడ్కర్ కాలానికి చెందిన గంగారపు సుశీల నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతోంది. ఈ నెల 8న జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్దారించారు.

ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని బయటకు వెళ్లాలని చెప్పడంతో ఈ నెల 9న ఇంటి నుండి ఒంటరిగా బయటకు వచ్చింది. తల దాచుకోవడానికి చోటు దొరకక పోవడంతో శుక్రవారం పాత వ్యవసాయ మార్కెట్లో జాగారం చేసింది. వ్యవసాయ మార్కెట్ సిబ్బంది అక్కడి నుండి శనివారం పంపించారు. ఉండటానికి స్థలం లేక పాత అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలో సులబ్ కాంప్లెక్స్ ముందు తోపుడు బండి మీద నిస్సహాయ స్థితిలో పడుకొని ఉంది. ఆమెను గమనించిన కాంగ్రెస్ నాయకుడు మొలుగు దిలీప్ ఈ నెల 10న వైద్యాధికారు లకు సమాచారం ఇచ్చారు. రెండు రోజులుగా రోడ్ల పైనే షెల్టర్ తీసుకున్న ఆమెను వైద్య సిబ్బంది అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. అనారోగ్యం బారిన పడ్డ ఆమెను కన్న కొడుకులు కూడా దరికి చేరదీయకపోవడం విస్మయం కల్గించింది.

Advertisement

Next Story