రేవంత్ దెబ్బకు టీడీపీ ఇక ఖాళీనే!

by Shyam |   ( Updated:2021-06-28 05:12:48.0  )
రేవంత్ దెబ్బకు టీడీపీ ఇక ఖాళీనే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో టీడీపీ పార్టీ గ్రామస్థాయి నుంచి పటిష్టంగా ఉన్నప్పటికీ.. నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. నడిపించే నాయకుడు లేకపోవడంతో ఇప్పటికే కొంతమంది ఇతర పార్టీలలో చేరగా.. మరికొంతమంది అభిమానంతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి తిరిగి తనకు ఉన్న పరిచయాలతో టీడీపీ క్యాడర్‌ను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.

నాడు ఘనం…నేడు డీలా..

1982 మార్చి 29న ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించారు. తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన నేత ఎన్టీఆర్. 1984లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి రెండవ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్. తిరిగి 1994 లో ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995 నుంచి 2004 వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు పని చేశారు. గ్రామస్థాయిలో అధిక సర్పంచ్ స్థానాలను చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో పార్టీని తెలంగాణ నేతలకు అప్పగించారు. అనంతరం రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ చిన్న నేతలంతా ఇతర పార్టీలలోకి వెళ్లారు. గ్రామస్థాయిలో టీడీపీ పటిష్టంగా ఉన్నప్పటికీ నాయకత్వం లోపించింది. నాటి నుంచి నాయకుడు లేక పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నారు.

ఇతర పార్టీలకు వెళ్లాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. టీడీపీ నుంచి 2018 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ.. వారు సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉన్న క్యాడర్ కూడా మంచి నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రేవంత్‌కు గతంలో టీడీపీలో ఉన్న పరిచయాలు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. టీడీపీలో పనిచేసిన కాలంలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి అందరితోనూ సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. అన్ని జిల్లాలకు కమిటీలను ప్రకటించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ పరిచయం నేడు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారంతా రేవంత్ వైపు మొగ్గు చూపితే తెలంగాణలో టీడీపీ మొత్తం ఖతమైనట్లేనని చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed