- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుదుచ్చేరిలో ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటుందా..?
చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల ముఖచిత్రంగా విచిత్రంగా కనిపిస్తున్నది. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఇప్పుడు సాలిడ్ నేతల కోసం వాంటెడ్ బోర్డును పట్టుకునే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా కీలకమైన నాలుగు స్థానాల్లో బరిలోకి దింపడానికి బలమైన నేత లేకుండా పోయారు. ఎన్నికలకు ముందు వీ నారాయణసామి సారథ్యంలోని కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకోలేక అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభానికి అధికార కూటమి నుంచి బలమైన నేతలు బీజేపీలోకి వలసవెళ్లడం కారణం. ఇదే కారణంతో కాంగ్రెస్ ప్రస్తుతం నేతల కొరతను ఎదుర్కొంటున్నది.
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా వృద్ధపార్టీ కాంగ్రెస్‌లో నేతలు ఎక్కువ టికెట్లు తక్కువ అనే పరిస్థితి ఉంటుంది. కానీ, పుదుచ్చేరిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులున్నాయి. నమశ్శివాయం రాజీనామాతో ఖాళీ అయిన విల్లియనుర్ స్థానం, శివకోఝుంతు కారణంగా లాస్‌పేట్, కాంగ్రెస్ మాజీ నేత జాన్ కుమార్ ప్రాబల్యమున్న కామరాజ్ నగర్, నెల్లితోప్ స్థానాల్లో కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయాన్ని బరిలోకి దింపడానికి ఆపసోపాలు పడుతున్నది. అధికారపక్షం తరహాలోనే విపక్ష కూటమి కూడా అదే స్థాయిలో విరుద్ధమైన సమస్య ఎదుర్కొంటున్నది. ప్రతిపక్ష శిబిరంలో నేతలు ఎక్కువ కావడం సమస్యగా మారింది.
ముఖ్యంగా సీఎం కుర్చీని ఆశించి పార్టీ మారిన వారు, విపక్ష పార్టీలో కొనసాగుతున్న వారి సంఖ్య ఎక్కువుండటంతో రగడ నెలకొంది. కాంగ్రెస్ మాజీ నేత నమశ్శివాయాన్ని సీఎం అభ్యర్థిగా బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తున్నది. ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం ఎన్ రంగస్వామి కూడా ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. ఏఐఏడీఎంకేలోనూ సీఎంపై కన్నేసిన నేతలున్నారు. కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు బీజేపీ ప్రాధాన్యతనిచ్చి బరిలోకి దించే నిర్ణయం తీసుకుంటుండంతో కీలక స్థానిక పార్టీ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి సెగలు కక్కుతున్నది. ఏఐఎన్‌ఆర్ కాంగ్రెస్ బీజేపీ సారథ్యంలోని కూటమిలో కలిసి పోటీ చేయాలా? లేక విడిగా పోటీ చేయాలా? అనే ఆలోచనలో పడింది.
ఎందుకంటే ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం ఎన్ రంగసామి సీఎం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామాలపై నిర్ణయం తీసుకోవడానికి ఆధ్యాత్మకి పర్యటన బాట పట్టారు. కమలం పార్టీకి ఒక్క సీటు లేకున్నా పెద్దన్నపాత్ర పోషించడాన్ని ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నట్టు భోగట్టా. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 15 స్థానాలను గెలుచుకుని సీఎంగా బాధ్యతలు తీసుకున్న ఎన్ రంగస్వామి ఒక వేళ ఒంటరిగా పోటీ చేసినా కింగ్ మేకర్ కావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు సింగిల్ ఫేజ్‌లో ఏప్రిల్ 6న జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం స్థానాలు 33 ఉండగా ఇందులో మూడు నియమిత పదవులు, మిగతా 30 సీట్లకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ కాంగ్రెస్, డీఎంకే కూటమిగా బరిలోకి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ 15 స్థానాలు, డీఎంకే రెండు స్థానాలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు వీ నారాయణసామి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టలేదు. ఏఐఏడీఎంకే నాలుగు స్థానాలు, ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ 8 సీట్లను సొంతం చేసుకుంది.
దీంతో అప్పటి వరకు సీఎంగా కొనసాగిన ఏఐఎన్ఆర్ చీఫ్ వీ రంగసామి ప్రతిపక్షంలోకి జారుకున్నారు. అంతకు ముందు 2011 ఎన్నికల్లో ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ స్వయంగా 15 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తుండగా ప్రజల్లోనూ ఓ మేరకు వ్యతిరేకత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అండతో బీజేపీ పావులు కదుపుతున్నా తమ కూటమిలోని ఏఐఎన్ఆర్ కాంగ్రెస్‌తో సీట్లు కలిసొచ్చే అవకాశముంది. ఏఐఏడీఎంకే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 5, 6 సీట్లను గెలుచుకుని ఫర్వాలేదనిపించుకుంటున్నది. ఈ లెక్కన కాంగ్రెస్ లోటును మిత్రపక్షం డీఎంకే పూడ్చితే ఈ కూటమికి విజయావకాశాలు లేకపోలేదు. లేదంటే బీజేపీ కూటమి అధికారాన్ని సాధించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకుల మాట.