కేసీఆర్ స్పీచ్ ప్లస్సా.. మైనస్సా..?

by Anukaran |
కేసీఆర్ స్పీచ్ ప్లస్సా.. మైనస్సా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పది రోజులుగా నగరాన్ని హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇంతకాలం టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజల్ని గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ పెట్టాయి. ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు ‘హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగరంగా మారుస్తామని, పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, పాకిస్తానీయులను తరిమేస్తామని, రోహింగ్యా క్యాంపుల్ని ఎత్తేయిస్తామంటూ..’ భావోద్వేగంతో కూడిన ప్రసంగాలు చేసినా ముఖ్యమంత్రి మాత్రం తాపీగా ప్రసంగించడంపై ఇప్పుడు పార్టీ నేతల్లో మిశ్రమ స్పందన వచ్చింది. ఆయన ప్రసంగం ఓట్లు కురిపించడానికి ఉపయోగపడుతుందా లేక చేతులెత్తేసినట్లే అనే సందేశాన్ని పంపిందా అనేది ఇప్పుడు నేతల మధ్య జరుగుతున్న చర్చ.

విజ్ఞత వెనక మర్మమేంటి..?

గ్రేటర్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కోరడం బతిమాలుకోవడమేనని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని చెప్పుకుని ఓట్లు రాలుస్తాయనే భరోసా ఉండేదని, ఇప్పుడు ఆ రెండూ ఉన్నా ప్రజలను ఎందుకు పదేపదే కోరాల్సి వస్తోందనే చర్చ జరుగుతోంది. బీజేపీ తరహాలో ఎక్కడా దూకుడు స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా అప్పీల్ చేసే తీరులోనే ప్రసంగించడం ద్వారా ప్రజల ఆలోచనల్లో ఒకింత మార్పు వచ్చిందని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. భావోద్వేగం కంటే ఆలోచన రేకెత్తించడం ప్రధానమని, అందుకే ఆవేశపూరిత ప్రసంగం కంటే విచక్షణకే ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. కర్ఫ్యూలు, మత ఘర్షణలు లేని ప్రశాంత జీవితం, పరిశ్రమలు రావడంతో ఉపాధి అవకాశాల కల్పన, ప్రజలు సుఖంగా ఉన్నారనే అభిప్రాయం వంటివి అన్ని వర్గాల ప్రజల్లో రియలైజేషన్ కలగడానికి దోహదపడుతుందనేదే ప్రసంగం ఉద్దేశమని నొక్కిచెప్పారు. ఆ కారణంగానే హిందీ, ఇంగ్లిష్​ భాషల్లో కూడా ప్రసంగించి ఇతర రాష్ట్రాలవారికి కూడా మెసేజ్ పంపారని గుర్తుచేశారు.

సాదాసీదాగా..

కేసీఆర్ నుంచి ఎప్పుడూ పిట్టకథలు, సామెతలు, నవ్వు పుట్టించే డైలాగులతో కూడిన ప్రసంగాలు వినడానికి అలవాటు పడిన జనం ఇప్పుడు సాదాసీదాగా ఉండడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ప్రసంగం డిఫెన్స్​ మోడ్‌లో ఉన్నట్లుగానే ఉంది తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదని కేసీఆర్ వీరాభిమాని వ్యాఖ్యానించారు. ఆరేళ్లలో చేసిందంతా ఒకసారి రీల్ తిప్పారు తప్ప ఇకపైన ఏం చేయబోతున్నారనేదానిపైగానీ, రెచ్చగొట్టే ఎమోషనల్ ప్రసంగాలు చేస్తున్న పార్టీలకు, అవి చేస్తున్న ఆరోపణలకు సమాధానం కేసీఆర్ ప్రసంగంలో లేదని గుర్తుచేశారు. కేంద్రం నుంచి తగిన సహకారం లేదని చాలాసార్లు విమర్శలు చేసినా, ఆ విషయాన్ని అంకెలతో వివరించి ఉంటే బాగుండేదని, అలా చేయకపోవడంతో బీజేపీ నేతల నోటికి తాళం వేయలేకపోయారన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అసలు కారణం దుబ్బాకేనా..?

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం తర్వాత డీలా పడిన టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ ఉత్సాహం కల్పించినా పది రోజుల ప్రచారం తర్వాత బీజేపీ దూకుడు ప్రచారం ముందు డీలా పడ్డారు. వరద సాయం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు విషయంలో పేదలు, మురికివాడల ప్రజలు ప్రచారం సమయంలో టీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో వారిలో నిరుత్సాహం పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉండడంతో కేసీఆర్ చేసే ప్రసంగం ఊపునిస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. వారు ఆశించిన తీరులో లేకపోవడం నిరుత్సాహానికి గురయ్యారు. మొత్తంగా కేసీఆర్ ప్రసంగం ఓటర్ల ఆలోచనలో మార్పు కలిగిస్తుందా, ఓట్లు రాలుస్తుందా అనే ఉత్కంఠ డివిజన్ స్థాయి కార్యకర్తల్లో ఎక్కువగా ఉంది. ఏదిఏమైనా 4వ తేదీన ఫలితాలతో కేసీఆర్ స్పీచ్ పార్టీకి లాభించిందా లేక ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిందా అనేది తేలిపోనుంది.

Advertisement

Next Story

Most Viewed